పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13వేల కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు పారిపోయిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరైంది. వైద్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని డొమినికా హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా వైద్యం కోసం ఆంటిగ్వా, బార్బుడా వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించినట్టు అక్కడి మీడియా పేర్కొంది.
ప్రత్యేక న్యూరాలజిస్ట్ కోసం ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ కోర్టును కోరడంతో అనుమతించింది. బెయిల్ కింద 10వేల తూర్పు కరేబియన్ డాలర్ల (రూ.2.75లక్షలు) బాండ్‌ను సమర్పించాలని ఆదేశించింది. అలాగే, మే 23న డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ మెజిస్ట్రేట్ ఎదుట కొనసాగుతున్న కేసు విచారణపైనా స్టే విధించించింది.
2018లో భారత్ నుంచి పారిపోయిన చోక్సీ.. అంటిగ్వా, బార్బుడాలో తలదాచుకున్న విషయం తెలిసిందే. అంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికాలో అక్రమంగా ప్రవేశించడంతో మే నెలలో అతడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో చోక్సీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారించిన డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చూడండి: Mehul Choksi: చోక్సీ ముంచింది రూ.6,344కోట్ల పైనే