వ్యక్తిగత గోప్యతను మానవహక్కుగా పరిగణించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, పూర్తి పారదర్శకత కలిగి ఉండాలని సూచించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన నాదెళ్ల.. భారీ సమాచారం సమాజ హితం కోసం ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ ష్వాబ్.. మైక్రోసాఫ్ట్ సీఈఓతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాదెళ్ల వేతనం, రాబడి సహా పలు విషయాలపై చర్చించారు.
వ్యాపారాన్ని గొప్పగా రూపకల్పన చేసుకోవాలి!
ప్రపంచంలోనే గొప్పవిలువైన సంస్థకు సీఈఓగా ఉంటూ విజయవంతమవడానికి అవలంబిస్తోన్న పద్ధతుల గురించి నాదెళ్లను అడిగారు ష్వాబ్. దీనికి సమాధానంగా వ్యాపారం గొప్పగా రూపకల్పన చేసినప్పుడే చుట్టూ ఉండే సమాజం కూడా కష్టపడి పని చేస్తుందన్నారు.
''ప్రజలు, సంస్థలు అన్నీ సమాజంలో భాగం, కనుక మన చుట్టూ హద్దులు ఉండకూడదు. అవి శాశ్వతం కాదు. 'ది నేరో కారిడార్' పుస్తకాన్ని ప్రస్తావిస్తూ... మీరు ఏం చేస్తున్నారో తెలుసుకున్నప్పుడే నష్టపోకుండా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం వాటాదారుల పెట్టుబడిదారీ విధానం ఉందని కమ్యూనికేట్ చేయడానికి నేటి ప్రపంచంలో సీఈఓలు ఎక్కువ పని చేయాల్సి ఉంది.''
-నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మాలి!
సాంకేతికత విషయంలో చైనా, అమెరికాల మధ్య విభజన జరగడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అని అడిగితే.. ప్రతీ దేశం తన జాతీయ భద్రతను కాపాడుకుంటుంది.అందువల్ల ప్రపంచ దేశాలు మధ్య ఏమి జరుగుతుందనే తపన మనలో ఉంటుందని ఆయన బదులిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం దాని ఉపయోగం మీద నమ్మకాన్ని పెంచుకొని స్థిరమైన భవిష్యత్తుకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు