స్టాక్ మార్కెట్లను ఈ వారం కూడా కంపెనీల త్రైమాసిక ఫలితాలే ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా అమెరికా-చైనా దౌత్య సంబంధాలు, కరోనా వైరస్ కేసులు, టీకాకు సంబంధించి వార్తలు కూడా ట్రేడింగ్ సాగే తీరును నిర్దేశించనున్నాయి.
ఈ వారం దిగ్గజ సంస్థలైన కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. బుధవారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం కూడా వెలువడనుంది. సంస్థల ఫలితాలు, ఫెడ్ ప్రకటన ఆధారంగా మదుపరులు క్రయ విక్రయాలు జరపొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాయబార కార్యాలయం మూత..
గూఢచర్యం ఆరోపణలతో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని చైనా రాయబార కార్యాలయం మూతపడింది. దీనితో ఇరు దేశాలు దౌత్య పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని ఆందోళనలు మొదలయ్యాయి. ఈ అంశంపైనా మదుపురుల దృష్టి సారించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, టీకాపై ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలేనని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.
ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:అలీబాబా 'జాక్ మా'కు భారతీయ కోర్టు సమన్లు