ఫిచ్ రేటింగ్స్ 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాత్రం భారత వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది.
"కరోనా వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. ఫలితంగా వ్యాపార పెట్టుబడులు, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతుంది."- ఫిచ్ రేటింగ్స్
ఫిచ్ రేటింగ్స్ 2019 డిసెంబర్లో... 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 5.6 శాతంగా, ఆ తరువాతి సంవత్సరంలో 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం
ఫిచ్ తన గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్ 2020లో, రానున్న రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.
"వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు పాఠశాలలు, సినిమా హాళ్లు, థియేటర్లు మూసివేస్తున్నాయి. వాణిజ్యం, పర్యటకం వంటి విషయాల్లో చైనాతో భారత్ సంబంధాలు సాధారణంగానే ఉన్నాయి. అయితే చైనా ముడి సామగ్రిపై భారత తయారీదారులు ఎక్కువగా అధారపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, యంత్రాలు, పరికరాల విషయంలో ఈ ప్రభావం అధికంగా ఉంది."- ఫిచ్ రేటింగ్స్
ఎస్ బ్యాంకు వైఫల్యంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా తీవ్రమయ్యాయని ఫిచ్ పేర్కొంది. ఈ ఆర్థిక ఒత్తిడి తగ్గించడానికి ఇటీవలి నెలల్లో విధాన రూపకర్తలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని అభిప్రాయపడింది.
కరోనా మహమ్మారి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ ప్రపంచ వ్యాధిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మరో 9,000 మంది మృత్యువాత పడ్డారు. భారత్‌లో ఇప్పటి వరకు 195 పాజిటివ్ కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: కరోనా భయాలతో అయినకాడికి అమ్మేస్తున్నారు