Cooking oil prices: ఎక్కడో ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని ఉక్రెయిన్‌లో కదా యుద్ధం జరుగుతోంది.. మనకేం కాదులే అనుకోడానికి లేదిప్పుడు. ఆ దాడుల ప్రతిధ్వనులు మన వంటింట్లోకి కూడా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా మన దగ్గర వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ‘విజయ’ బ్రాండ్ పేరుతో సమాఖ్య వంటనూనెలను ప్రజలకు విక్రయించే ‘తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’ (ఆయిల్‌ఫెడ్) నెలరోజుల వ్యవధిలో లీటరు పామాయిల్ ధరను రూ. 29 వరకూ పెంచింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వానికి నివేదించింది.
వంటనూనెల్లో 70 శాతం..
రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న పొద్దుతిరుగుడు నూనె ధర కూడా చకచకా పెరుగుతోంది. మనదేశంలో వినియోగించే వంటనూనెల్లో 70 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెలైతే 90 శాతం ఇతర దేశాల నుంచే వస్తున్నాయి. పామాయిల్ ఇండోనేషియా, మలేషియా.. పొద్దుతిరుగుడు ఉక్రెయిన్, రష్యాల నుంచి నౌకల్లో సముద్రమార్గంలో రావాలి. కానీ గత నెలరోజులుగా సరిగా రావడం లేదు. ఇండోనేషియాలో పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టడంతో దాని ధర రూ. 116 నుంచి 145కి చేరింది. ఏడాది క్రితం ఇది రూ.100 లోపే ఉండేది.
ఉక్రెయిన్ నుంచే..
తెలంగాణలో నెలకు 50 వేల టన్నుల వంటనూనెలను మార్కెట్లలో విక్రయిస్తుండగా ఇందులో 20 వేల టన్నుల వరకూ పొద్దుతిరుగుడు నూనె ఉంటుంది. ఇది మొత్తం ఉక్రెయిన్ నుంచే దిగుమతి అవుతున్నందున సరఫరాలో అంతరాయం ఏర్పడి ధరలకు రెక్కలొచ్చాయి.
*టన్ను పామాయిల్ ధర 2021 ఫిబ్రవరిలో 1,057 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 1,750 డాలర్లకు చేరిందని ‘భారత వంటనూనెల ఉత్పత్తిదారుల సంఘం’ తాజా నివేదికలో వెల్లడించింది. పొద్దుతిరుగుడు నూనె టన్ను ధర 1,400 నుంచి 1,520 డాలర్లకు చేరింది.
ఇప్పట్లో తగ్గనట్లే..
వంటనూనెల ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడంలేదని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ తిరుమలేశ్వర్ ‘ఈనాడు’తో అన్నారు. యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ నూనెల మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించారు.
పెరిగిన కల్తీ...
వంటనూనెల ధరలకు రెక్కలు రావడం వల్ల ఇదే అదనుగా కల్తీల బెడద పెరిగిందని ఓ వ్యాపారి చెప్పారు. పొద్దుతిరుగుడులో పత్తిగింజల నూనె, పామాయిల్‌లో తక్కువ నాణ్యమైన నూనెలను కలిపేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రష్యా- ఉక్రెయిన్ కీలక చర్చలు- సంధి కుదిరేనా?