భారత కంపెనీల్లో కార్మికుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా తో వలస కార్మికులంతా సొంత ఊర్లకు వెళ్లడం ఇందుకు నేపథ్యం. దీంతో బీమా కవరేజీ, ఆరోగ్య సదుపాయాలు, ఉండడానికి హాస్టల్ వసతి తదితరాలను అందిస్తామని.. తిరిగి ప్లాంట్లకు రావాలని ఆయా కంపెనీలు కోరుతున్నాయి. గత రెండు నెలలుగా ఉత్పత్తి లేక ఆదాయాలు పడిపోయిన కంపెనీలు.. ఉత్పత్తి పెంచుకోవడానికి వలస కార్మికులు ఇపుడు కీలకంగా మారారు.
45-60 రోజులు పట్టొచ్చు..
వలస కార్మికులందరూ తిరిగి రావడానికి.. కనీసం 45-60 రోజుల సమయం పట్టొచ్చని స్థిరాస్తి, వినియోగదారు ఉత్పత్తులు, వాహన, నిర్మాణ, జౌళి రంగాలకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కన జులైకి కానీ ఉత్పత్తి పెరగకపోవచ్చన్నమాట. వెండార్లకు ఇపుడు కార్మికుల కొరతే అతిపెద్ద సమస్యగా మారింది. వారి నుంచి విడి పరికరాలు రానపుడు కార్ల కంపెనీలు మాత్రం ఏం చేస్తాయి. ఇక నిర్మాణ రంగానికి వస్తే.. ఇపుడిపుడే పరిస్థితులు బాగుపడతున్నాయి. కార్మికుల సంఖ్య మే నెలలో 70,000కు తగ్గింది. అయితే గత 15 రోజుల్లో రోజుకు 2,500-3,000 మంది చేరుతూ 1,20,000 మందికి వారి సంఖ్య చేరిందని ఓ నిర్మాణ కంపెనీ అంటోంది. వర్కర్లు తిరిగి రావడానికి పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపింది. వారిలో ఉన్న మానసిక భయాలను పారదోలడానికి తాము తీసుకుంటున్న చర్యల గురించి వీడియో, యాప్‌ల రూపంలో చెబుతున్నారు.
ప్లాంట్ల సమీపంలో వసతి
డాబర్, పార్లే ప్రోడక్ట్స్, పెప్సికో వంటి వినియోగదారు ఉత్పత్తి సంస్థలు వలస కార్మికులు లేక స్థానిక ప్రజలపై ఆధారపడుతున్నాయి. తయారీ ప్లాంట్లకు చేరువలో వారి కోసం వసతిని సైతం సమకూరుస్తున్నాయి. డాబర్ వంటి కంపెనీలు ఆరోగ్య బీమాను కల్పిస్తున్నాయి. నెస్లే, మారికో, హెచ్‌యూఎల్‌లు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. మే 20 తర్వాత పరిస్థితులు కొంత మెరుగయ్యాయి.
స్థిరాస్తి కంపెనీలూ..
ఇక స్థిరాస్తి కంపెనీలూ కార్మికులు తిరిగి సైట్లకు రావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలను, వసతులను కల్పిస్తున్నట్లు ఓ దిగ్గజ స్థిరాస్తి కంపెనీ చెప్పుకొచ్చింది. సాధారణంగా ప్లాంట్ల వద్ద 2,000 సిబ్బంది వరకు పనిచేస్తారని.. వారిలో 800 మంది ఇళ్లకు వెళ్లారని అంటోంది. 45 రోజుల్లోగా వారిని వెనక్కి రప్పించేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.
స్థానికులపైనే ఆధారం..
వసల కార్మికులకు హాస్టల్ వసతులు అవసరం. ఒక్కోసారి ఇంటికి వెళితే నెల వరకు తిరిగి రారు. అందుకే ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న కార్మికులపైనే జౌళి కంపెనీలు దృష్టి పెడుతున్నారు. స్థానికులపైనే ఆధారపడుతున్నారు. మరో పక్క, దైమ్లర్ ఇండియా వంటి సంస్థలు కార్యకలాపాలు పెంచుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలోనూ సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వడం గమనార్హం.
దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం
వలస కార్మికులపై ఎక్కువ ఆధారపడ్డ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నాయి. అయితే ఈ సమస్య ఎక్కువ కాలం ఉండకపోవచ్చని.. చెల్లింపులు సక్రమంగా జరిగి సరైన వసతులు కల్పిస్తే వారు తిరిగి పనిలో చేరతారని వారు అంటున్నారు.
ఇదీ చూడండి:కరోనా సంక్షోభంలో ల్యాప్‌టాప్ అమ్మకాల జోరు