వర్షాకాలంలోనూ వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో హోటళ్లు, శుభకార్యాలు అంతగా లేకపోవడంతో నూనెలకు డిమాండు లేక ధరలు తగ్గాలి. కానీ గత పక్షం రోజుల్లోనే విజయ బ్రాండు పొద్దుతిరుగుడు లీటరు నూనె ధర రైతుబజార్లలోనే రూ.100 నుంచి 130కి పెరిగింది. బయటి చిల్లర మార్కెట్లలో బ్రాండును బట్టి రూ.140కి పైగా ధర పలుకుతోంది. గత నెల ఒకటో తేదీతో పోలిస్తే ఏకంగా రూ.30 అదనంగా పెరిగింది.
ఎందుకు పెరుగుతున్నాయ్
ఇదొక్కటే కాకుండా వేరుసెనగ, రైస్‌బ్రాన్, పామాయిల్ ధరలూ మండిపోతున్నాయి. ‘విజయ’ బ్రాండు పేరుతో వంటనూనెలను విక్రయిస్తోంది. సగటున రోజుకు హైదరాబాద్‌కు 600.. తెలంగాణకు 2 వేల టన్నుల నూనెలు అవసరం. ఇందులో రోజుకు 300 టన్నులు పొద్దుతిరుగుడు నూనె రాష్ట్రానికి కావాలి. ధర ఒక్కసారిగా పెరగడంతో టోకు వ్యాపారులు నూనెల కొనుగోలు తగ్గించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం వంటనూనెల టోకు వ్యాపారుల సంఘం ప్రతినిధులతో చర్చించి.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ఆరా తీశారు.
ఉక్రెయిన్, రష్యాలలో డిమాండు
పొద్దుతిరుగుడు నూనె ఉక్రెయిన్, రష్యాల నుంచి ఎక్కువగా భారత్‌కు దిగుమతి అవుతోంది. జనవరిలో మనకు 3.01 లక్షల టన్నులు రాగా నెలలో 1.58 లక్షల టన్నులే వచ్చింది. ఈ నెలలో ఇంకా తగ్గిపోయింది. దీంతో దేశమంతటా ఒక్కసారిగా పొద్దుతిరుగుడు నూనె కొరత ఏర్పడి ధర రాజుకుందని ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ తిరుమలరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఇలాంటి కొరతను రాష్ట్ర టోకు వ్యాపారులు ముందుగా ఊహించకపోవడంతో నిల్వలు తగ్గుతున్నట్లు చెప్పారు.
వాటికి డిమాండు
చైనా గత 3 నెలల్లో 5 లక్షలకు గాను 17 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్, రష్యాల నుంచి కొనుగోలు చేసింది. చైనా దిగుమతులు ఒక్కసారిగా పెంచేయడంతో ఫ్యూచర్ మార్కెట్ తారుమారైంది. భారతదేశంతో ఘర్షణ పరిస్థితులున్నందున డ్రాగన్ ముందస్తు నిల్వలు పెట్టడానికి దిగుమతులు పెంచిందా అనే అనుమానాలు టోకు వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారని తిరుమలరెడ్డి వివరించారు. పొద్దుతిరుగుడు నూనె ధరలు మండుతున్నందున పామాయిల్, వేరుసెనగ, సోయా నూనెలకు డిమాండు పెరుగుతోంది.
ఇదీ చదవండి : ఔషధం మాటున మాదకద్రవ్యం... హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం