ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసేందుకు అత్యంత అనువైన నగరంగా మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది. ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఐటీ నిపుణులు ఈ నగరానికే ఓటేసినట్లు టెక్‌గిగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యున్నత జీవన ప్రమాణాలు, వృత్తిలో ఎదుగుదల అవకాశాల పరంగా బెంగళూరు ఉత్తమమైన నగరమని 40 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్పష్టం చేసింది.
ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో కనీసం రెండు ఏళ్ల అనుభవం ఉన్న 25-35 ఏళ్ల వయసు కలిగిన 1,830 మంది ఐటీ నిపుణులు.. తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
రెండో స్థానంలో హైదరాబాద్..
బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కే మొగ్గుచూపారు ఐటీ ఉద్యోగులు. సుమారు 13 శాతం మంది హైదరాబద్‌లో ఉద్యోగం చేసేందుకు ఇష్టపడినట్లు సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో 11 శాతం ఓట్లతో పుణె నిలిచింది. అత్యంత ఆదరణ కలిగిన నగరాల్లో దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం అతి తక్కువ ఓట్లు సాధించినట్లు పేర్కొంది.
బెంగళూరే ఎందుకు!
అత్యున్నత జీవన ప్రమాణాల ఉన్నట్లు.. 58శాతం మంది ఉద్యోగులు చెప్పారు. వేతనాల్లో పెరుగుదల వేగంగా ఉంటుందని 71 శాతం మంది, వృత్తిలో ఎదుగుదల-ఉద్యోగవకాశాల ప్రమాణాలు మెరుగ్గా ఉన్నట్లు 68 శాతం మంది బెంగళూరుకు ఓటేశారు.
తమకు ఇష్టంతో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్లు 57 శాతం మంది ఐటీ నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తులో వేరే నగరానికి మారే అంశంపైనా చాలా మంది విముఖత వ్యక్తం చేశారు.