కొవిడ్ పరిణామాల్లో గిరాకీ అధికమైన రంగాల్లో ఐటీ(IT Sector) ప్రధానమైనది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు(Corona lockdown), కర్ఫ్యూలు, ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఐటీతో పాటు మరిన్ని రంగాలు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానానికి మారాయి. బోధన కూడా ఆన్‌లైన్‌లో తప్పనిసరి కావడం, ఆర్థిక సేవలు, ఇతర రంగాల్లో డిజిటలీకరణ శరవేగంగా జరగడం ఐటీ కంపెనీలకు(IT Companies) వరంగా మారింది. ప్రాజెక్టులు అధికంగా రావడంతో దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా, అధునాతన సాంకేతికతలు నేర్చుకున్న విద్యార్థులను కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసుకునేందుకు, అనుభవజ్ఞులకు వేతనాలు పెంచేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా అమెజాన్, విప్రో, క్యాప్‌జెమినీ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నియామకాలకు(Job Alert) సిద్ధమయ్యాయి.
అమెజాన్: రాబోయే నెలల్లో అంతర్జాతీయంగా కార్పొరేట్, టెక్నాలజీ పదవుల్లో 55,000 మంది ఉద్యోగులను నియమించుకోడానికి ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon India) సన్నాహాలు చేస్తోంది. గూగుల్ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య మూడోవంతు కంటే ఎక్కువ కాగా.. ఫేస్‌బుక్ ఉద్యోగులకు సమానం. ఇందులో 40,000కు పైగా ఉద్యోగాలు అమెరికాలో కాగా.. మిగతావి భారత్, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉండనున్నాయి. అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈనెల 16న 'అమెజాన్ కెరీర్ డే' జాబ్ ఫెయిర్ ద్వారా సంస్థ ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అమెజాన్.జాబ్స్/ఇన్ పై పూర్తి సమాచారం పొందొచ్చు. అన్ని రకాల ఉద్యోగాలకు ఎంపికలుంటాయని, అనుభవంతో పనిలేదని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో 2,75,000 మంది పనిచేస్తున్నారు. తాజా నియామకాలతో ఈ సంఖ్య 20 శాతం పెరుగనుంది.
విప్రో: ఇంజినీరింగ్ పట్టభద్రుల కోసం 'ఎలైట్ నేషనల్ ట్యాలెంట్ హంట్' పేరిట ఫ్రెషర్ల నియామక కార్యక్రమాన్ని విప్రో ప్రకటించింది. దీని కింద ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలకు సెప్టెంబరు 15 వరకు తాజా ఇంజినీరింగ్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ రూ.3- 3.8 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఇవ్వనుంది. 2022లో ఉత్తీర్ణులు అయ్యేవారు ఇందుకు అర్హులు.
క్యాప్‌జెమినీ: ఇంజినీరింగ్, ఎంసీఏ తాజా ఉత్తీర్ణుల కోసం పూల్డ్ క్యాంపస్ డ్రైవ్ 2021ను క్యాప్‌జెమినీ ఇండియా ప్రకటించింది. అన్ని విభాగాలు, బ్రాంచీలకు చెందిన ఇంజినీర్లు తమ వెబ్‌సైట్‌పై దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
అప్పిన్‌వెంటివ్: ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ అప్పిన్‌వెంటివ్ ఈ ఏడాది చివరకు 500కు పైగా నియామకాలు చేపట్టనుంది. సీనియర్ నాయకత్వ పదవులతో పాటు పలు స్థాయుల్లో టెక్నాలజీ నిపుణులను నియమించుకోనుంది. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 700 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇదీ చూడండి: క్యూ1లో జీడీపీ 20 శాతం జంప్- కొవిడ్ నుంచి తేరుకున్నట్టేనా?