Amazon-Future case: అమెజాన్ కేసులో ఫ్యూచర్ రిటైల్‌కు పెద్ద ఊరట దక్కింది. రిలయన్స్ రిటైల్‌తో చేసుకున్న రూ.24,731 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ 'అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం' ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి తిరస్కరించడం సహా దిల్లీ హైకోర్టు ఇచ్చిన మూడు ఆర్డర్లను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. తాజా విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
విలీన ఒప్పందంపై యథాపూర్వ స్థితి కొనసాగించాలంటూ ఫ్యూచర్ రిటైల్(ఎఫ్‌ఆర్‌ఎల్)కు గతేడాది ఫిబ్రవరి 2న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజీఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం పక్కన పెట్టింది. విలీన ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్(ఎస్‌ఐఏసీ) ఇచ్చిన అత్యవసర తీర్పు(ఈఏ)ను సమర్థిస్తూ గత మార్చి 18న ఈఏపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ 2021 అక్టోబరు 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. 'హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతున్నాం. పరిశీలనల ప్రభావానికి లోబడకుండా, సాక్ష్యాలపై ఆధారపడి తీర్పునివ్వాలని సంబంధిత న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశామ'ని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, జస్టిస్ హిమా కోహ్లిలు కూడా ఉన్న సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును వేగవంతంగా విచారణ చేయడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు.
ఫ్యూచర్‌పై కఠిన చర్యలతో ఎవరికీ ప్రయోజనాలు దక్కవు
రుణ బకాయిల చెల్లింపుల ఎగవేత కారణంగా ఫ్యూచర్ రిటైల్(ఎఫ్‌ఆర్‌ఎల్)పై కఠిన చర్యలు తీసుకుంటే.. ఎవరికీ ప్రయోజనాలు దక్కకుండా పోతాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కంపెనీ విజ్ఞప్తి విషయంలో స్పందించాలంటూ 27 బ్యాంకుల కన్సార్షియానికి సుప్రీం సూచించింది. 'మొత్తం 27 బ్యాంకుల్లో 10 ప్రైవేటు, మూడు విదేశీ బ్యాంకులున్నాయి. మాకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ ఎలా నిలబడగలుగుతుంది. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఉండరాదు. అమెజాన్ లేదా మధ్యవర్తిత్వంతో మాకు సంబంధం లేదు. అందులో మేం భాగస్వాములం కాదు. అదీ కాక ఈ ఎగవేత నెల కిందటే జరిగింద'ని బ్యాంకుల తరఫు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది అన్నారు. 'మీరు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలి. లేదంటే దీని వల్ల ఎవరికీ ప్రయోజనాలు దక్కవు. రిట్ పిటిషన్ నిలబడుతుందా లేదా అన్నది వేరే విషయం. ఒక వేళ ఇదే మీ ధోరణి అయితే.. అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయకూడదు' అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రశ్నించారు. ఆయన సూచన మేరకు రుణ చెల్లింపుల ఎగవేతపై ఆలోచించగలమని బ్యాంకుల కన్సార్షియం పేర్కొంది. 'సెప్టెంబరు వరకు బ్యాంకులు సమయం ఇస్తే.. ప్రతి ఒక్కరికీ చెల్లింపులు జరుగుతాయి' అని ఫ్యూచర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విచారణను గురువారానికి కోర్టు వాయిదా వేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: Union Budget 2022: డిజిటల్ భారత్‌కు 'బడ్జెట్' రైట్ రైట్..