ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం.. బెజోస్ మొత్తం సంపద 180.6 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో టెస్లా, స్పేస్ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 162.2 బిలియన్ డాలర్లు.
జాబితాలోని ఇతర కుబేరులు..
- బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం ( ఫ్రాన్స్‌కు చెందిన లూయిన్ విట్టోన్ ఛైర్మన్, సీఈఓ) 160.1 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది.
- మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 126 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గో స్థానంలో ఉన్నారు.
- సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయన సంపద 105.8 బిలియన్ డాలర్లు.
- ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుగా పేరుగాంచిన వారెన్ బఫెట్ 96.3 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు.
- ఓరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ఈ జాబితోలో 7వ స్థానంలో ఉన్నారు. ఈయన నికర విలువ 89.7 బిలియన్ డాలర్లు.
- సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సహవ్యవస్థాపకులు.. లారీ పేజ్ (88.9 బిలియన్ డాలర్లు), సెర్గి బ్రిన్(86.2 బిలియన్ డాలర్లు)లు వరుసగా 8,9 స్థానాల్లో నిలిచారు.
- భారత సంతతికి చెందిన ముకేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత) ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 81.3 బిలియన్ డాలర్లుగా అంచనా.