చైనాలో నావెల్ కరోనా వైరస్ విజృంభణతో.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొంది. హాంకాంగ్ వెళ్లే ఏఐ314 విమానాల్ని ఫిబ్రవరి 7 తర్వాత నడపకూడదని నిర్ణయించింది. ఇప్పటికే ఇండిగో సంస్థ తమ సర్వీసులను ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు రద్దు చేసింది.
ప్రాణాలు తీస్తున్న మహమ్మారి
చైనాలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలుత రోజుకు 10 నుంచి 20కి పరిమితమైన మరణాలు ఇప్పుడు ఏకంగా 50 దాటిపోతోంది. ఆదివారం 57 మంది ప్రాణాలొదలగా.. సోమవారం ఏకంగా 64 మంది మృత్యువాతపడ్డారు. దీనితో చైనాలో ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 490కి చేరింది. మరో 24 వేల మందికిపైగా ఈ వైరస్ సోకింది.
ఆంక్షలు
ఇప్పటికే పటిష్ఠ చర్యలు చేపట్టిన చైనా ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధ్యక్షుడు జిన్‌పింగ్ నిన్న మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ కట్టడికి సమయంతో కలిసి పరుగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: చమురు ధరల తగ్గుదలతో.. మార్కెట్లకు లాభాల పంట