ఈ వేసవిలో ఎయిర్ కండీషనర్లు (ఏసీ) మరింత ప్రియం కానున్నాయి. విడి భాగాల దిగుమతి భారం తగ్గించుకునేందుకు.. ప్రముఖ కంపెనీలన్నీ గృహ అవసరాలకు వినియోగించే ఏసీల ధరలు పెంచాలని భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
ధరలు పెంచినా.. ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదవ్వచ్చని వోల్టాస్, డైకిన్, ఎల్జీ, ప్యానసోనిక్, హాయర్, బ్లూ స్టార్, శాంసంగ్ వంటి కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎండా కాలంతో పాటు.. చాలా రంగాల్లో ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తుండటం ఇందుకు కారణంగా చెబుతున్నాయి.
ధరలు ఎంత పెరగొచ్చంటే..
మార్కెట్ వర్గాల ప్రకారం.. ఏసీల ధరలు త్వరలో దాదాపు 5-8 శాతం పెరిగే అవకాశముంది. ఈ నెలాఖరులోపు 3-5 శాతం వరకు ధరలు పెంచాలని భావిస్తున్నట్లు డైకిన్ ఇప్పటికే ప్రకటించింది.
మరో దిగ్గజ సంస్థ ప్యానసోనిక్ ఏసీలపై 6-8 శాతం, ఫ్రిజ్‌లపై 3-4 శాతం వరకు ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో ఏసీల విక్రయాలు దాదాపు 25 శాతం పెరిగినట్లు ప్యానసోనిక్ దక్షిణాసియా విభాగ సీఈఓ మనీశ్ శర్మ వెల్లడించారు. వేసవిలోనూ ఆ వృద్ధిని కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల డిమాండ్..
ఈ వేసవిలో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఏసీలకు మంచి డిమాండ్ ఉండొచ్చని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, టౌన్లపై కరోనా ప్రభావం తక్కువగా ఉండటం, గత ఏడాది సరైన సమయానికి వర్షాలు పడటం, కరెంట్ కోతలు లేకపోవడం వంటివి ఇందుకు తోడ్పడతాయని అంచనా వేస్తున్నాయి.
దేశంలో ఏటా దాదాపు 75 లక్షల వరకు ఏసీలు అమ్ముడవుతుంటాయి. దేశవ్యాప్తంగా 15కుపైగా కంపెనీలు ఏసీల వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.
ఇది చదవండి:ఏప్రిల్ నుంచి పెరగనున్న టీవీల ధరలు!