ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ తమ ఉద్యోగులకు ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి(వీఆర్ఎస్)కు భారీ స్పందన వచ్చింది. దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియగా.. మొత్తం 92 వేల 700 మంది అర్జీ పెట్టుకున్నారు. ఇందులో 78 వేల 300 మంది బీఎస్‌ఎన్‌ఎల్, 14 వేల 378 మంది ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకున్నారు.
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా.. మరో 6 వేల మంది పదవీ విరమణ చేశారని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్ అండ్ ఎండీ పీకే పుర్వార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్తో పాటే మరో ప్రభుత్వరంగ సంస్థ ఎంటీఎన్ఎల్కూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
వీఆర్ఎస్ ఎందుకంటే..?
భారీ అప్పుల్లో కూరుకుపోయిన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.69,000 కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించింది. వ్యయాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. 70,000- 80,000 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇవ్వడం ద్వారా రూ.7,000 కోట్ల వేతన బిల్లును పొదుపు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది.
వీఆర్ఎస్ ఎక్స్గ్రేషియా లెక్క..
వీఆర్ఎస్కు అర్హత కలిగిన ఉద్యోగులు.. వారు పని చేసిన ప్రతి ఏడాదికి 35 రోజుల చొప్పున, మిగిలిన ఉద్యోగ సంవత్సరాలకు 25 రోజుల చొప్పున ఎక్స్గ్రేషియా పొందుతారు.