మీరు 20 నుంచి 30ఏళ్ల వయసు మధ్యలో ఉన్నారా? ఉద్యోగంలో ఉండి నెలవారీ సంపాదిస్తున్నారా? మీకొచ్చే డబ్బును ఎలా నిర్వహించుకుంటున్నారు? వేతనం నుంచి ఎంతో కొంత మిగిల్చుకుంటే దాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? సాధారణంగా ఇలాంటి దానికి చాలా మంది చెప్పే సమాధానం కచ్చితమైన రాబడులను అందించే పథకాల్లోనే పెడతామని అంటారు. తాము పెట్టిన పెట్టుబడిలో కొంచెం కూడా కోల్పోవద్దనేది వారి అభిమతం.
ఎన్నో విషయాల్లో రిస్క్ తీసుకున్నా…ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ వయసులోని వారు జీవితంలో రకరకాల రిస్క్‌లను తీసుకుంటారు. వరల్డ్ టూర్ కోసం ఏకంగా చేసే ఉద్యోగాన్నే వదిలేసుకోగలరు. తమ ప్యాషన్ కోసం ఎక్కువగా జీతమిచ్చే జాబ్‌ను సైతం వదిలేసుకొని రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ధీమాగా ఉంటారు. అయితే ఎటొచ్చీ తాము సంపాదించిన దాన్ని రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో పెట్టమంటే దాదాపు చాలా మంది ససేమిరా అంటారు. మీరు కష్టపడినట్టుగానే మీ డబ్బు కూడా కష్టపడి మంచి లాభాలను తీసుకురాగలగాలంటే వీటిని రిస్క్‌కు గురిచేయాల్సిందే. యవ్వనంలో ఉన్న వారు ఆర్థిక సలహాదారులను సంప్రదించినా సరే వారు ఎక్కువగా రిస్క్ ఉన్న పథకాలనే ఎంచుకోమని చెబుతారు. పెట్టుబడులపై వాస్తవ రాబడి ద్రవ్యోల్బణానికి సరిసమానంగా వస్తే ఏం లాభం. నిజానికి మనం పెట్టే పెట్టుబడి విలువను కోల్పోతున్నట్టే. తల్లిదండ్రుల బాటలోనే…
20 లేదా 30ల్లో ఉన్నవారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఆర్థిక అంశాల్లో కొందరు తమ తల్లిదండ్రులు పాటించిన విధానాలనే అనుసరిస్తూ వస్తున్నారు. వాళ్ల తల్లిదండ్రులు కచ్చితమైన రాబడులనందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో చేస్తున్నందుకు తాము అందులోనే డబ్బు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇలా పెట్టుబడులపై మరింత రక్షణనివ్వాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తే నిజానికి అవి వృద్ధి కాకుండా అలాగే ఉంటాయి. పైగా పన్ను, ద్రవ్యోల్బణం రూపంలో పెట్టిన పెట్టుబడి విలువ తరిగిపోతూ ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువున్న వాటిలోనే…కొత్తగా పెట్టుబడి ప్రారంభించేవారు లేదా యవ్వన దశలో ఉన్న మదుపరులు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే తమ అన్ని పెట్టుబడులు సులువుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఉండాలని అనుకుంటారు. 20-30ఏళ్ల మధ్య ఉన్నవాళ్లలో దాదాపు చాలా మందికి ప్రత్యేకంగా ఆర్థిక లక్ష్యాలంటూ ఏర్పర్చుకోరు. అందుకే వారు ఎక్కువ నగదు లభ్యత(లిక్విడిటీ) ఉండే పథకాల్లోనే పెడతారు. వాళ్ల సమీప లక్ష్యాల్లో భాగంగా ఉన్నత చదువులు, తల్లిదండ్రులకు సహాయంగా ఉండడం లాంటివి ఉన్నా వాటిపై వారికి స్పష్టత ఉండదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక సాధారణంగా ఈ వయసులో ఉన్నవారు దీర్ఘకాల అవసరాల గురించి దాదాపు ఆలోచించరు. అంటే స్వభావరీత్యా కొందరు అలా ఉంటారు.
అంత దూరం ఆలోచించరు!
సాధారణంగా ఈ వయసులో ఉండే కొందరి ఆలోచన ఎలా ఉంటుందంటే తాము 60 లేదా 65ఏళ్లకు మించి బతకమనే ఉంటుంది. సరిగ్గా 60ఏళ్లు నిండేసరికి ఈ లోకాన్ని ఎవరూ వీడి వెళ్లరు కదా! అంటే ఇక్కడ ఉద్దేశం జీవించే కాలం గురించి అంతగా ఆలోచించొద్దు అని. సాధారణంగా వ్యక్తుల సగటు ఆయుర్దాయం ఏటా పెరుగుతూ వస్తోంది. అందుకని ఆ తర్వాత జీవించే కాలానికి ఆర్థిక అవసరాలకు తగినట్టు ఇప్పటినుంచే ప్రణాళిక వేసుకోవాలి.
పిల్లలపై ఆధారపడి జీవించలేం!
ఇదే కాకుండా లేట్ వయసులో పెళ్లి, తర్వాత ఒకరో ఇద్దరో పిల్లలు. మలి వయసు చేరుకునేటప్పటికి వారి పైన ఆధారపడి జీవించలేం. అందుకని రిటైర్‌మెంట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. మారిన జనరేషన్‌కు తగ్గట్టుగా ఆర్థిక విషయాల్లో మన వ్యవహార శైలీ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ద్రవ్యోల్బణానికి సమానంగా వచ్చినా సరిపోదు
పెట్టుబడి చేసే విధానంపై ధోరణిని మార్చుకోవాలి. రిస్క్ ఎక్కువుండే పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని సులువుగా తట్టుకోగలవు. ద్రవ్యోల్బణానికి సరిపడా రాబడి వస్తుందని సంతోషపడుతున్నట్టయితే మీ డబ్బు వృద్ధి చెందడంలేదని అర్థం. నష్టభయం ఉన్న పథకాల్లో పెట్టుబడి పెడుతున్నట్టయితే 7-10 ఏళ్ల దాకా దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టే విషయమై ఆలోచించాలంటారు నిపుణులు.
ఇది కాదు రిస్క్ అంటే…
రిస్క్ తీసుకోవడమంటే గుడ్డిగా ఎక్కువ లాభాలనిచ్చే షేర్లు, ఫండ్లను ఎంచుకోవడం కాదు. తొలుత ఆ ఫండ్, లేదా షేర్, పథకాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. తొలిసారిగా పెట్టుబడి పెట్టేవారు పెట్టుబడి కేటాయింపుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. కొత్త పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. మొదట్లో 30-40శాతం ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కేటాయించుకోవాలి. ఆ తర్వాతే ఈ నిష్పత్తిని పెంచుకోవడం మేలు.
పెట్టుబడి కాలవ్యవధి తగ్గింపుతో…
7-10ఏళ్ల దాకా దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం ఇష్టంలేనివారు కొంచెం తక్కువ కాలవ్యవధి ఉండే పథకాలను ఎంచుకోవడం మేలు. ఈక్విటీ ఆధారిత పొదపు పథకాలను(ఈఎల్ఎస్ఎస్) ఎంచుకోవడం మంచిది. వీటికి లాకిన్ పీరియడ్ గడువు 3ఏళ్లు. ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఇవి చాలా మెరుగైన రాబడులను అందిస్తాయి.
ఆర్థిక సలహాల కోసమైతే…
భావోద్వేగపరమైన మద్దతు కోసం కుటుంబసభ్యులు, స్నేహితుల మీద ఆధారపడటం మంచిదే కానీ ఆర్థిక సలహాల కోసం మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. సాధారణంగా ఇలాంటి ఆర్థిక విషయాల్లో సలహాల కోసం ఎక్కువగా స్నేహితులు, కుటుంబసభ్యుల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. బ్యాంకర్లు ఇచ్చే సలహాలను కూడా ఒక్కోసారి పాటిస్తుంటారు. కమిషన్ కోసం బ్యాంకు వారేమో తమ ఉత్పత్తులను ఇతరులకు అంటగట్టాలని చూస్తుంటారు. అందుకే ఓ వ్యక్తిగత ఆర్థిక సలహాదారును సంప్రదించి సరైన ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
పెట్టే పెట్టుబడిపై అవగాహన …
మనం పెట్టుబడి పెట్టే సాధనాలపైన పూర్తి అవగాహన ఏర్పర్చుకోవడం ముఖ్యం. ఆర్థిక అంశాల మీద ఆసక్తి చూపించి వాటి గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఓ కారు కొనాలనుకున్నారు. అందుకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అయితే అనుకున్న సమయానికి డబ్బు తీసుకోలేకపోయారు. బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి అప్పుడే డబ్బులు తీయకూడదని లక్ష కారణాలు చెబుతారు. అప్పుడు బాధపడి ఏం లాభం.!
భవిష్యత్‌లో కృతజ్ఞత చెప్పుకుంటారు!
యవ్వన దశలో ఉన్నవారికి మరో 20 లేదా 30ఏళ్ల పాటు సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి తమ పోర్ట్‌ఫోలియోను దీర్ఘకాలం పాటు ఉండేలా చేసుకొని సంపద సృష్టించుకోగలగాలి. మీరు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలిగితే భవిష్యత్‌లో మీకు మీరే కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదీ చూడండి : కంటి చూపులేనివారి కోసం ఆర్బీఐ 'యాప్'