దేశంలో కరోనా రెండో దశ విజృంభన నేపథ్యంలో పెట్టుబడులు, వినియోగం విషయంలో తీవ్రమైన అనిశ్చిత పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఎప్పుడు అవసరమైనా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చర్యలు చేపట్టాలని సూచించారు.
కరోనా రెండో దశ సేవారంగం వంటి వాటిపై నేరుగా ప్రభావం చూపడం అనే విషయంతో సంబంధం లేకుండా.. ఆర్థిక వ్యవస్ధలో అనిశ్చితిని మరింత పెంచుతుందని అన్నారు. కరోనాను భారత్ ఒక దశలో పూర్తిగా ఓడించే స్ధితికి చేరుకున్నా.. బ్రిటన్ సహా పలు దేశాల నుంచి కొత్తగా వచ్చి కొత్త రకం వైరస్‌ల వల్ల ప్రస్తుతం పరిస్ధితి క్లిష్టతరంగా మారిందని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
కరోనా తీవ్రత గతంలో కన్నా చాలా తీవ్రంగా ఉన్నా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 11శాతానికి పెరగగలదని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ నేపథ్యంలో దీని వల్ల ఉండే ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని ఆర్థిక శాఖ విశ్లేషించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉద్ధీపనలపై జవాబు చెప్పగలమని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తెలిపారు.
ఇవీ చదవండి: రెమ్‌డెసివిర్ మంత్రదండం కాదు: గులేరియా