ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి... జడ్పీ పదవుల కేటాయింపులో సామాజిక, ఉద్యమ నేపథ్యాలకు పెద్దపీట వేసింది. జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో 62శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించింది. కో ఆప్షన్ సభ్యుల ఎంపికలోనూ అదే సూత్రాన్ని అనుసరించింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి మంత్రులు, ఎమ్మెల్యేలతో సుదీర్ఘ కసరత్తు చేసి...ఏకాభిప్రాయంతో ఎంపిక చేశారు.
32 జడ్పీ పదవుల్లో 17 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64 ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ స్థానాల్లో 40 ఎస్సీ,ఎస్టీ, బలహీన వర్గాలకు కేటాయించింది. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవులు 32 ఉండగా అందులో 17 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూర్చోబెట్టింది. బీసీలకు 7, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4 జడ్పీ ఛైర్ పర్సన్ పదవులను కేటాయించింది. జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్ పదవులు 32 ఉండగా వాటిలో 23 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించింది.
'సిరిసిల్ల జడ్పీ వైస్ ఛైర్మన్గా విద్యార్థి నాయకుడు'
ఈ దఫా ఉద్యమ నేతలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ భావించడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ దిశగా కసరత్తులు చేశారు. దశాబ్దంన్నరగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు జడ్పీటీసీలుగా గెలిస్తే వారి వివరాలు ఇవ్వాలని మంత్రులకు కేటీఆర్ ప్రత్యేకంగా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి నాయకుడు సిద్ధం వేణుకు జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్గా అవకాశం దక్కింది.
ఉద్యమ నాయకులకు జడ్పీ పదవులు
జిల్లాల్లో ఉద్యమ నేపథ్యం కలిగిన పార్టీ నేతలకు జడ్పీ పదవులు దక్కాయి. ములుగు జడ్పీకి కుసుమ జగదీష్, నల్గొండ జిల్లాకు బండ నరేందర్ రెడ్డి, వరంగల్ అర్బన్ కి డాక్టర్ సుధీర్ కుమార్, అదిలాబాద్కి రాథోడ్ జనార్దన్కు ఉద్యమకారుల కోటాలో ఛైర్ పర్సన్ పదవులు దక్కాయి. జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లోనే కాకుండా కోఆప్షన్ మెంబర్ లకు సంబంధించి కూడా ఇదే సూత్రాన్ని తెరాస అమలు చేసింది.
ఇవీ చూడండి : 'ఈవీఎంలైనా బ్యాలెటయినా గెలుపు గులాబీదే'