కరోనా కట్టడికి బృహన్ ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే జరిమానా విధిస్తోంది. ఫైన్ కట్టేందుకు నిరాకరించే వారు, డబ్బులు లేనివారితో రోడ్లను శుభ్రం చేయిస్తోంది.
ముంబయిలో రెండు రోజుల్లోనే వంద మందికి పైగా మాస్క్లు లేకుండా పట్టుబడ్డారు. రూ.200 జరిమానా చెల్లించని వారికి చీపుర్లు ఇచ్చి నగర రహదారులను శుభ్రం చేయించింది బీఎంసీ. అయితే.. ముంబయిలో ఏప్రిల్ నుంచి 212 రోజుల్లో రూ.3,49,34,800 జరిమానా వసూలు చేసినట్లు తెలిపింది. కేవలం అక్టోబర్లోనే రూ.18,21,400 లను సేకరించినట్లు వెల్లడించింది
నిర్లక్ష్యంగా...
అధికారులు ఎన్నోసార్లు మాస్క్లు ధరించాలని చెబుతున్నప్పటికీ.. నిబంధనలు పాటించకుండా ముంబయి వాసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించేవారి వారిపై రోజూ దాదాపు 20,000 కేసులు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బీఎంసీ కమిషనర్ ఐ.ఎస్. చాహల్.
"మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ తరుచూ అభ్యర్థిస్తోంది. కానీ, చాలా మంది ఈ మాటను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. జరిమానా చెల్లించేందుకు కొంతమంది నిరాకరిస్తున్నారు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండటం లేదు. అందుకోసమే రోడ్లను శుభ్రం చేసే ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాం."
-- బీఎంసీ అధికారి.
విభిన్న స్పందనలు..
ఈ నూతన శిక్షలను బీఎంసీ చట్టాలకు లోబడే తీసుకువచ్చామని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకునేందుకు బీఎంసీ బృందాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయి. మార్కెట్లు, రైల్వేస్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నాయి.
'మాస్క్లు లేకుండా పట్టుబడ్డ వారిలో కొంతమంది తమ తప్పును ఒప్పుకుని సమాజ సేవలో భాగమవుతున్నారు. మరికొంతమంది అధికారులపైనే తిరగబడుతున్నార'ని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విశ్వాస్ మోతే తెలిపారు, అయితే.. బీఎంసీ చర్యలకు సామాజిక మాధ్యమాల్లో మద్దతు లభిస్తోంది. ప్రజా ప్రయోజనం కోసం అమలు చేస్తున్న ఈ శిక్షలకు 'లైకులు' కొట్టి స్వాగతిస్తున్నారు.
ఇదీ చూడండి:భారత్లో 6 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు