అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పలువురు ప్రముఖ నేతలు మళ్లీ బలం పుంజుకుని విజయం సాధించారు. స్వల్ప వ్యవధిలోనే గెలుపొంది ప్రజల్లో వారికున్న పట్టును నిలబెట్టుకున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.
ప్రశ్నించే గొంతుకనవుతానని
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమి చవిచూశారు. అయినా పట్టు వీడకుండా అవకాశం వచ్చిన ప్రతిసారీ సర్కారుపై విరుచుకుపడుతూ తన వాణిని బలంగా వినిపించారు. ప్రశ్నించే గొంతుకనవుతానంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా ఎమ్మెల్యేగా ఓడినా... మల్కాజిగిరి ఎంపీగా గెలిచి సత్తా చాటారు.
ఓడినా కుంగిపోకుండా...
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటి రెడ్డి వెంకటరెడ్డిది ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా కుంగిపోకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై గెలుపొందారు.
భాజపా పథకాలే ప్రచారాస్త్రాలుగా...
అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్... భారీ తేడాతో ఓటమి చెందినా... ఎక్కడా నిరాశ పడకుండా లోక్ సభ బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందారు. కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలుగా ఎన్నికల్లో విస్త్రత ప్రచారం చేసి... విజయాన్ని అందుకున్నారు.
కిషన్‌రెడ్డి హవా
అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి... అనూహ్యంగా ఓటమి పాలైన కిషన్‌రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 62 వేల ఓట్ల తేడాతో సికింద్రాబాద్ స్థానం నుంచి తెరాస అభ్యర్థి సాయికిరణ్ యాదవ్‌పై జయభేరీ మోగించారు.
ఫలించిన మోదీ మంత్రం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బోధ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. అనంతరం భాజపా గూటికి చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొంది సత్తా చాటారు. ఆదివాసీ, యువత ఓట్లతో పాటు మోదీ నినాదంతో విజయ తీరాలకు చేరారు.
సిట్టింగ్‌ను కాదన్న విశ్వాసం
ఖమ్మంలో తెరాస తరఫున బరిలో దిగిన నామ నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం గులాబీ తీర్థం పుచ్చుకుని ఎంపీగా గెలుపొందారు. సిట్టింగ్‌ను కాదని టికెట్ ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టారు.
సింగరేణి సిగలో తెరాస
కాంగ్రెస్ తరఫున చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన నేతకాని వెంకటేశ్ లోక్సభ ఎన్నికల్లో తెరాస తీర్థం పుచ్చుకుని ఎంపీగా బరిలో నిలిచి గెలిచారు. కేసీఆర్ చివరి క్షణంలో తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఇదీ చూడండి : కాషాయ సునామీ 2.0: సర్వం మోదీమయం