రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా... మూడు జిల్లాల పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం 2,799 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు జారీపోకుండా విపక్షాలు క్యాంపులు ఏర్పాటు చేశాయి. పలు కేంద్రాల వద్ద ఓటర్లను పార్టీ నేతలు బస్సుల్లో తరలించారు. అందరూ ఓటేసినందున పలుచోట్ల వంద శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. వరంగల్లో 97.89 శాతం పోలింగ్ నమోదు కాగా...నల్గొండలో 98.80 శాతం పోలింగ్ నమోదైంది. జూన్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నల్గొండలో తెరాస నుంచి తేరా చిన్నపరెడ్డి, హస్తం పార్టీ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెరాస నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇవీ చూడండి:దర్జాగా వచ్చాడు... దారుణంగా నరికి చంపాడు