ఐపీఎల్.. లేబోరేటరీ లాంటిదని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. ఆటగాళ్లు వీలైనన్నీ ప్రయోగాలు చేసేందుకు ఆస్కారం ఉందని చెప్పాడు. గత సీజన్ వరకు పంజాబ్‌కు ఆడిన అశ్విన్.. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టోర్నీలో ఇప్పటివరకు 139 మ్యాచ్‌లాడి 125 వికెట్లు పడగొట్టాడు.
"మీ నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు, కొత్తగా చేసేందుకు ఇదో(ఐపీఎల్) అద్భుతమైన అవకాశం. మీరు ఎంతో ఇష్టపడే విషయాలు ప్రయత్నించేందుకు ఇది ఓ ప్రయోగశాల లాంటిది. సృజనాత్మకత పెంపొందించేందుకు సరైన సమయం. పనిభారాన్ని చక్కగా సమన్వయం చేసుకోవాలని కోచ్ పాంటింగ్ మాకు సూచించాడు. అతడితో కలిసి పనిచేస్తుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రేయస్ కూడా మంచి సారథి. చాలా విషయాలు అతడితో చర్చించాను" -అశ్విన్, దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్
కరోనా ప్రభావంతో మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి ఎక్కువుతున్న కారణంగా దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్న జట్లు శిక్షణ శిబిరాల్లో చెమటోడ్చుతున్నాయి.