హైదరాబాద్ నగరంలో ఏ కార్యక్రమం జరిగినా మెుదటగా గుర్తొచ్చేది పోలీసులే. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఖాకీలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ, పంచాయతీ, నిన్న పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే స్థానిక సంస్థల పోరు తెరపైకి వచ్చింది.ఆ తర్వాత పురపాలిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వీటితో పాటు నగరానికి వచ్చే వీఐపీలకు బందోబస్తులతో క్షణం తీరిక లేకుండా ఖాకీలు కష్టపడుతున్నారు. ఇలా వరుసగా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించడం వల్ల కొందరు పోలీసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరికొందరు అనంతలోకాలు చేరుతున్నారు.
మృత్యువు ఒడికి...
గత మూడు రోజుల్లోనే ఇద్దరు పోలీసులు చనిపోయారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అంజయ్య సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. మాదన్నపేట్ ఠాణాలో ఓ కానిస్టేబుల్ ఈ నెల 12న హార్ట్ అటాక్‌తో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించాలి...
పోలీస్ మ్యాన్యువల్ ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏటా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. నిధుల కొరతతో పాటు వీరిపై పనిభారం పెరగడం వల్ల వాటి ఉసే లేదు. 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేయాల్సి ఉంది. ఎప్పుడో కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పోలీస్ కమిషనర్లే బాధ్యతగా ఒక్కోసారి చొరవ తీసుకుంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులతో మాట్లాడి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా ఎప్పటికో వచ్చే ఆరోగ్య సమస్యలు మూడు పదుల వయసులోనే వచ్చిపడుతున్నాయని వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఖాళీలతో సతమతం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పోలీసుల కొరత ఏర్పడింది. దీనికితోడు నానాటికి పెరుగుతున్న నగర జనాభా మరో కారణం. మూడు కమిషనరేట్ల పరిధిలో సరాసరి లక్ష మంది జనాభాకు కనీసం 100 మంది పోలీసులు కూడా ఉండటం లేదు. దీని వల్ల ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది.
షిఫ్ట్ విధానంపై స్పందన లేదు...
అన్ని శాఖల్లో మాదిరిగానే షిఫ్ట్ విధానం పోలీస్శాఖలోను అమలు చేయాలని కొందరు ఖాకీలు పోరాటం చేశారు. అయినా ప్రభుత్వం నుంచి, పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.