ఆ చెట్టు అమ్మలా ఆదరిస్తుంది... నాన్నలా సంరక్షిస్తుంది. వర్షమొస్తే గొడుగవుతుంది. ఎండొస్తే... నీడనిస్తుంది. ఎంతమంది వచ్చినా కాదనకుండా.. అక్కున చేర్చుకుంటుంది. అటువైపు వెళ్లే వారందరినీ అక్కడ ఆగేలా ఆకర్షిస్తుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ అక్కడకు వెళ్లేలి అనిపించేలా ఆకట్టుకుంటోంది. "వృక్షో రక్షతి రక్షితః" అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
60 మీటర్లు... 125 ఏళ్లు...
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో 216వ జాతీయ రహదారి పక్కన ఆశ్రమ పాఠశాల ఉంది. అక్కడికి వెళ్లగానే.. సమీపంలో ఓ రావిచెట్టు ఉంటుంది. ఆ వృక్షరాజం వయస్సు సుమారు 125 సంవత్సరాలు. అరెకరం స్థలంలో వ్యాపించి ఉన్న ఈ మహావృక్షం 60 మీటర్ల ఎత్తుకు ఎగబాకింది.
కోరిన కోర్కెలు తీర్చే...
ఆ రావి చెట్టు నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి.. అక్కడే కొలువై ఉన్న శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో పాలుపోస్తే మనసులోని కోరిక నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. అందుకే... కోరిని కోర్కెలు తీర్చే స్వామిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కీర్తి గడించాడు. ఇదే విశ్వాసంతో హైదరాబాద్ నగరం నుంచి సైతం భక్తులు మోపిదేవిలోని రావిచెట్టు వద్దకు వస్తున్నారు.
అంతటా 45 డిగ్రీలు... అక్కడ మాత్రం!
సూర్యుడి తాపానికి చెట్లు కాస్త ఉపశమనాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఉష్ణోగ్రతలను సగానికి పైగా తగ్గించేయటం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా!? అయితే... మోపిదేవికి వెళితే సరి. అక్కడి ఈ రావిచెట్టు కింద ఎండ సగానికంటే తక్కువగా ఉంటుంది. బయట 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే... ఇక్కడ మాత్రం 20 డిగ్రీలే నమోదవుతోంది. ఈ కారణంగా.. సమీపంలోని రైతులు, కూలీలు.. అటువైపు వెళ్లే బాటసారులు అక్కడే సేదతీరుతున్నారు. అంతే కాదండోయ్... ఆ చెట్టు కింద ఉన్న చేతిపంపు నీరు అమృతాన్ని మరిపిస్తోంది.
మోపిదేవి రావిచెట్టు కింద ఉష్ణోగ్రతలెందుకు సగానికంటే తక్కువగా నమోదవుతున్నాయి! ఆ చేతిపంపు నీళ్లెందుకు అమృతాన్ని తలపిస్తున్నాయి. అనే లోగుట్టు అక్కడి సుబ్రహ్మణ్యేశ్వరుడికే ఎరుక.
ఇదీ చదవండీ: సినీడైరీ: పుష్పాలకు ఐశ్వర్య రాయ్ పేరు..!