పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశామని ఆర్మీ అధికారులు తెలిపారు. జైషే ఉగ్రసంస్థ నాయకత్వాన్ని అంతం చేయడంలో సఫలమయ్యామని తెలిపారు.
దేశంలో నక్కిన 18 మంది ఉగ్రవాదులను 21 రోజుల్లో భద్రతా దళాలు తుదముట్టించాయని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ తెలిపారు. హతమైన వారిలో 14 మంది జైషే ఉగ్రవాద సంస్థకు చెందినవారున్నారనని చెప్పారు. అందులో ఆరుగురు కమాండర్లు ఉన్నట్టు వెల్లడించారు.
ముదాసిర్ హతం
పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, జైషే మహ్మద్ ఉగ్రసంస్థ కీలక కమాండర్ ముదాసిర్ ఖాన్ను హతమార్చినట్టు వెల్లడించారు. ఏడాది కాలంగా అతడు ఉగ్రసంస్థలో ప్రధానవ్యక్తిగా ఉన్నాడన్నారన్నారు.
ఉగ్రవాదం అంతం వరకు..
ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే వరకు ముష్కర మూకలపై దాడులు చేస్తామని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ తెలిపారు. జైషేతో పాటు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలకు చెందిన వారినీ మట్టుబెడతామని చెప్పారు. జైషేను సమూలంగా నాశనం చేస్తామన్నారు. ఆత్మాహుతి దాడులు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
పుల్వామా ఉగ్రదాడిపై విచారణ లోతుగా జరుగుతోందని చెప్పారు. దాడికి పేలుడు పదార్థాలను ముదాసిర్కు ఎవరు అందించారనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. ఎన్ఐఏతో సమన్వయం చేసుకొని విచారణను వేగవంతం చేస్తున్నామన్నారు.