father murdered two children : కన్న బిడ్డలను గుండెలపై పెట్టుకుని పెంచాల్సిన తండ్రి కర్కోటకుడుగా మారాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్న... కాలయముడయ్యాడు. ఇంట్లో గొడవలు చినికిచినికి గాలివానగా మారి ఆ పసివాళ్లను బలిగొన్నాయి. తల్లిమీద కోపంతో... ముక్కుపచ్చలారని చిన్నారులను అతి కర్కశంగా బావిలోకి తోసేసి... హతమార్చాడు.
మహబూబాబాద్‌జిల్లా గడ్డిగూడెం తండాకు చెందిన రామ్‌కుమార్... అదే గ్రామానికి చెందిన శిరీషను 9 ఏళ్లకిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. రామ్‌కుమార్ ముంబయిలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన దంపతుల మధ్య గొడవ జరిగింది. కుటుంబంలో ఆర్థిక సమస్యలపై భర్తను ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో.. కోపం పెంచుకున్న రామ్‌కుమార్.. ఇద్దరు పిల్లల్ని పంట చేనులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకువచ్చి.. గ్రామస్థులు చూస్తుండగానే అందులో పడేశాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై చిన్నారులను బయటకు తీసినా... అప్పటికే వారు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి.
రామ్‌కుమార్‌తనతో మంచిగానే ఉంటాడని.. ఆర్థిక సమస్యలపై ప్రశ్నించినందుకే తనను కొట్టాడని భార్య ఆరోపిస్తోంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే... ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయని ఆమె రోదిస్తోంది. తన బిడ్డల మరణానికి కారణమైన.. రామ్‌కుమార్‌ను చంపాలని శిరీష డిమాండ్‌చేస్తోంది.
పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి రామ్‌కుమార్‌కోసం గాలిస్తున్నామని... త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు...
భూక్యా రామ్ కుమార్... సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇతను భార్యాపిల్లలతోటి 4 రోజుల క్రితం గడ్డిగూడెంకు వచ్చాడు. భార్య తల్లిగారి ఇల్లు రామ్ కుమార్ ఇంటికి ఎదురుగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగితే భర్త దగ్గర పిల్లలను వదిలేసి వెళ్లింది. రామ్ కుమార్ తన ఇద్దరు పిల్లలను వ్యవసాయం పొలం దగ్గరకు తీసుకెళ్తానని ఇంట్లో చెప్పి... తీసుకొచ్చి వ్యవసాయ బావిలో తోసేసి చంపేశాడు. ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని, గోల్డ్ లోన్ వంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగానే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. పిల్లలను బావిలో తోసేసి పారిపోయాడు. వీలైనంత త్వరగా అతడిని పట్టుకుంటాం.
-రవికుమార్, మహబూబాబాద్ రూరల్ సీఐ
చూడముచ్చటైన కుటుంబం...ఒక్కసారిగా చిన్నాభిన్నం కావడంతో.. గడ్డిగూడెం తండాలో విషాదం అలముకుంది
ఇదీ చదవండి: Nizamabad Family Suicide Case : కుటుంబం ఆత్మహత్య కేసు.. నిజామాబాద్‌కు విజయవాడ పోలీసులు