మాదకద్రవ్యాల కేసులో బంగాల్ భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) నాయకురాలి అరెస్టు కలకలం రేపింది. హూగ్లీ జిల్లా బీజేవైఎం కార్యదర్శి పమేలా గోస్వామితో పాటు.. ఆమె సహాయకుడు ప్రభీర్ కుమార్ను న్యూ అలీపూర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
''ఆమె గత కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటోందనే సమాచారం ఉంది. సరఫరాదారు ప్రభీర్తో కలసి డ్రగ్స్ అమ్మకందారులకు విక్రయించేందుకు వెళ్లిందనే విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నాం.''
-పోలీసులు
రూ.లక్షల విలువ..
పమేలా గోస్వామి బ్యాగ్ నుంచి లక్షల రూపాయల విలువ చేసే(100 గ్రాముల కొకైన్)ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే ఇవి వారి వద్దకు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. భాజపా ఎంపీలు సహా.. పైస్థాయి నేతలతో పమేలాకు మంచి సంబంధాలున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి తృణమూల్ సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్య స్పందించారు. భాజపా మహిళా నేతలు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
భాజపా విసుర్లు..
ప్రభుత్వం చేతిలో పోలీసులు కీలుబొమ్మలా మారిపోయారని బంగాల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య విమర్శించారు. డ్రగ్స్ ప్యాకెట్లను పోలీసులే పమేలా గోస్వామి కార్-బ్యాగుల్లో పెట్టారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు.
''ఇంతకుముందు కూడా భాజపా కార్యకర్తలపై అక్రమ ఆయుధాల కేసు బనాయించారు. ప్రస్తుత ఘటనపై నాకు పరిమిత సమాచారమే అందుబాటులో ఉంది. పమేలా నిజంగా తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్షపడుతుంది.''
-లోకేత్ ఛటర్జీ, భాజపా ఎంపీ.
ఇదీ చదవండి: భాజపా-కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ