విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ నేర్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొచ్చిలోని సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలను సందర్శిచిన రాహుల్.. అక్కడి విద్యార్థినులతో ముచ్చటించి... తనకు తెలిసిన జపనీస్ మార్షల్ ఆర్ట్స్ 'ఐకిడో'ను వారికి నేర్పించారు.
ఏం చేశారంటే..
ఎవరైనా తమను నెట్టివేస్తే.. నేల ఆధారం చేసుకుని, ఎలా పడిపోకుండా ఉండాలో విద్యార్థినులకు రాహుల్ నేర్పించారు. ముందుగా.. ఒక విద్యార్థినిని నేలపై కూర్చోమని చెప్పారు. ఆమెను నెట్టమని మరో విద్యార్థినికి చెప్పి, ఎలా పడిపోకుండా ఉండాలో సూచించారు. అనంతరం.. మరో ఐదారుగురు విద్యార్థినులు ఆమెను నెట్టేందుకు ప్రయత్నించినా.. ఆ విద్యార్థిని పడిపోకుండా ఉండడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే ఐకిడో టెక్నిక్ అని రాహుల్ వివరించారు. అనంతరం.. పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతులు అని కితాబిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత.