భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్(kangana ranaut news) చేసిన వ్యాఖ్యలపై(kangana ranaut on indian freedom) తీవ్ర దుమారం చెలరేగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆప్ తదితర విపక్షాలతో పాటు కొందరు భాజపా నేతలు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. కంగనకు(kangana ranaut latest news) ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. నటి వ్యాఖ్యలపై స్వాతంత్య్ర సమరయోధుల వారసులు తీవ్రంగా మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారు శుక్రవారం నిరసన చేపట్టి, కంగన దిష్టిబొమ్మను(kangana ranaut effigy burnt) దహనం చేశారు. నటిపై కేసు నమోదు చేయాలంటూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్; రాజస్థాన్‌లోని జోధ్‌పుర్, జైపుర్, చూరూ, ఉదయ్‌పుర్‌లలో కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ముంబయిలోని కంగన నివాసం ఎదుట యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
మానసిక స్థితిని ముందే గమనించాలి
" అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేయడానికి ముందే, వాటి కోసం ఎంపికచేసిన వ్యక్తుల మానసిక స్థితిని గమనించాలి. తద్వారా దేశాన్ని, సమరయోధులను వారు అవమానపరచకుండా నిలువరించవచ్చు. మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర సమరయోధులను కంగన అవమానించారు."
- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ నేత (ఈ ట్వీట్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ట్యాగ్ చేశారు)
డ్రగ్స్ ప్రభావంతోనే ఈ వ్యాఖ్యలు
దేశ స్వాతంత్య్రంపై వ్యాఖ్యానించడానికి(kangana ranaut on indian freedom) ముందు కంగన అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలి. వెంటనే ఆమెను అరెస్టు చేయాలి.
- నవాబ్ మాలిక్ (ఎన్సీపీ), మహారాష్ట్ర మంత్రి
ద్వేషానికి కంగన ప్రతినిధి
" పద్మశ్రీ కంగనా రనౌత్... ద్వేషం, అసహనం, క్రూరత్వానికి ప్రతినిధి. 2014లో దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని ఆమె భావించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే... దేశంలో ద్వేషం, అసహనం, బూటకపు దేశభక్తి, అణచివేతలకు 2014లోనే స్వాతంత్య్రం లభించింది. ప్రధాని పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడమూ ఆశ్చర్యం కలిగించలేదు. దేశంలో విపరీతంగా ప్రవహిస్తున్న ద్వేషానికి ప్రధాని కార్యాలయం మూలంగా మారింది."
- తుషార్ గాంధీ, మహాత్మాగాంధీ మునిమనుమడు
దేశద్రోహం కేసు నమోదు చేయాలి
కంగనపై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయాలి.
- నీలమ్ గోరె, శివసేన
ముంబయి పోలీసులు కేసు పెట్టాలి
బాలీవుడ్ నటి వ్యాఖ్యలు సరికాదు. వాటిని ఖండిస్తున్నాం. ఆమెపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేయాలి.
- కేజ్రీవాల్, దిల్లీ సీఎం
ఆమె వ్యాఖ్యలు పూర్తిగా తప్పు
" స్వాతంత్య్రంపై కంగన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. మోదీ ప్రధాని అయిన తర్వాత సామాన్యులు నిజమైన స్వాతంత్య్రాన్ని ఆస్వాదిస్తున్నారు. మోదీ కార్యక్రమాలను కంగన ప్రశంసించవచ్చు. కానీ, దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని విమర్శించే హక్కు మాత్రం ఆమెకు లేదు."
- చంద్రకాంత్ పాటిల్, మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు
స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేశారు
స్వాతంత్య్రం ఫలితంగా సిద్ధించిన వాక్ స్వేచ్ఛను కంగన దుర్వినియోగం చేశారు. ఆమె వ్యాఖ్యలు సమరయోధుల త్యాగాలకు అవమానకరం. వీటిని న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకుని, చర్యలు చేపట్టాలి.
- ప్రవీణ్‌శంకర్ కపూర్, దిల్లీ భాజపా అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: '2014లోనే దేశానికి అసలైన స్వాతంత్ర్యం'.. కంగన వ్యాఖ్యలపై దుమారం