Wing Commander Prithvi Singh Chauhan: తమిళనాడులోని కూనూర్‌లో ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను నడిపిన పైలట్, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 13 మందిలో పృథ్వీ ఒకరు. తన నైపుణ్యంతో శత్రువుల యుద్ధవిమానాలను బెంబేలెత్తించిన పృథ్వీ.. ఇలా ప్రమాదవశాత్తు మరణించరన్న విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Bipin Rawat Helicopter Pilot: తమ కుమారుడు పృథ్వీ అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్ అని ఆయన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. సుడాన్లో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని చెప్పారు. అతని పోరాటపటిమను వాయుసేన ఉన్నతాధికారులు మెచ్చుకున్నారని వెల్లడించారు.
"పృథ్వీపై మా ఒత్తిడి ఏం ఉండేది కాదు. మనసు ఏం చెబితే అది చేయాలని చెప్పేవాళ్లం."
-సురేంద్ర సింగ్ చౌహాన్, పృథ్వీ తండ్రి
బేకరీ యజమాని అయిన తండ్రి, గృహిణి అయిన తల్లికి జన్మించిన పృథ్వీ... తొలి పోస్టింగ్‌లో హైదరాబాద్‌లోనే పనిచేశారు. ఆ తర్వాత గోరఖ్‌పుర్, గువాహటి, ఉధమ్‌సింగ్ నగర్, జామ్‌నగర్, అండమాన్ నికోబార్ సహా పలు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో పనిచేశారు. కుటుంబంలో ఏకైక మగ సంతానంగా జన్మించిన పృథ్వీకి తొలి నుంచీ ఆర్మీలో చేరాలనే తపన ఉండేదని ఆయన బంధువులు చెబుతున్నారు.
"యుక్త వయసు నుంచే ఆర్మీ పాఠశాలలో చేరాలని కలలు కనేవాడు. సెకండరీ స్కూలింగ్ అయిపోగానే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికయ్యాడు."
-పృథ్వీ బంధువు
"పోస్టింగ్ తర్వాత వచ్చినప్పుడల్లా.. నన్ను ప్రోత్సహించేవాడు. సాయుధ దళాల్లో చేరాలని చెప్పేవాడు. 30 ఏళ్ల తర్వాత రక్షాబంధన్‌కు ఇంటికి వచ్చాడు. అప్పుడు పిల్లలతో కలిసి ఆనందంగా గడిపాడు. ఒకట్రెండు నెలల క్రితమే కలిశాడు. అంతలోనే ఇలా జరిగింది."
-పృథ్వీ సన్నిహితుడు
చివరగా కోయంబత్తూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పృథ్వీ సేవలందించారు. 2007లో వివాహం చేసుకున్న పృథ్వీకి ఓ కూతురు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: