West Bengal Government Fined Rs 50 Lakhs : సీఐడీ ప్రవర్తన వల్ల.. బంగాల్ ప్రభుత్వానికి రూ.50 లక్షల జరిమానా విధించింది కోల్‌కతా హైకోర్టు. రెండు వారాల్లో రిజిస్ట్రార్ జనరల్ వద్ద ఈ మొత్తాన్ని జమ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 'మీరు పేదల డబ్బుతో ఆడుకుంటున్నారా? అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఇదీ జరిగింది.. రూ.50 కోట్ల ఆర్థిక నేరం కేసును సీబీఐ, ఈడీ విచారించాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి.. సీఐడీ అందించలేదు. ఇక దీనికి విరుద్ధంగా మునుపటి దర్యాప్తు ఆర్డర్‌ను పునఃపరిశీలించాలని సీఐడీ దరఖాస్తు చేసుకుంది. సీఐడీ ప్రవర్తనపై తీవ్ర మనస్తాపానికి గురైన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ.. బంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద జమ చేయాలని ఆదేశించారు.
'మీరు పేదల డబ్బుతో ఆడుకుంటున్నారా?. ఆ డబ్బు ఎవరు తీసుకున్నారో సీఐడీకి తెలియదు. నాకు తెలుసు' అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు మూడు రోజుల్లో దర్యాప్తును సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఈ ఆదేశాలు అమలు చేయకపోతే, హోం సెక్రటరీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించారు. వెంటనే రిజిస్ట్రార్ ఈ ఆదేశాన్ని అమలు చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు.
సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను కేసు విచారించాలని ఆదేశించిన హైకోర్టు.. దాదాపు మూడేళ్లుగా సీఐడీ దర్యాప్తు ఎలా సాగిందో చెప్పడానికి ఇది ఉదాహరణ కావచ్చని అని చెప్పింది. ఇంత భారీ ఆర్థిక ఆరోపణలు వచ్చినప్పటికీ.. ఇంతవరకూ పెద్ద చేపను సీఐడీ పట్టుకోలేకపోయిందని చెప్పింది. దీనికి బదులుగా చిన్నవాళ్లపై ఆరోపణలు చేస్తోందని మండిపడింది.
అలిపుర్దువార్లోని ఓ సహకార గ్రూపులో దాదాపు రూ.50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసును సీబీఐ, ఈడీ ఏకకాలంలో విచారించాలని న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఆదేశించారు.
తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా
'ఇంటి పనిని భార్యాభర్తలిద్దరూ సమానంగా చేయాలి!'.. హైకోర్టు వ్యాఖ్యలు