Lakshman Rekha CJI N V Ramana: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక అంశాలపై ప్రసంగించారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో తమ పరిమితులను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. లక్ష్మణ రేఖను దాటొద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని గుర్తుచేసిన సీజేఐ... ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదనతో చెప్పారు.
![CMs and chief justices of HCs conference](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15155563_cji-1.jpg)
కాగా, ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైంది. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు విచ్చేశారు. న్యాయమూర్తుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
న్యాయవ్యవస్థ బలోపేతం, న్యాయవ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, దేశవ్యాప్తంగా అన్ని కోర్టు సముదాయాల్లో నెట్‌వర్క్ అనుసంధానతను బలోపేతం చేయడం వంటి విస్తృత అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులు/సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పనపై చర్చించనున్నారు. మౌలికవసతుల కల్పన, భవనాల సామర్థ్యం పెంపు అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. సదస్సు ముగిసిన తర్వాత.. చర్చించిన అంశాలపై సీజేఐ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
![CMs and chief justices of HCs conference](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15155563_cji-3.jpg)
బంగాల్ సీఎం మమతా బెనర్జీ, చత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, గుజరాత్ సీఎం భూపెంద్ర పటేల్ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
![CMs and chief justices of HCs conference](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15155563_cji-2.jpg)
ఇదీ చదవండి: 'న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం'