బంగాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలతో అఖిల పక్ష భేటీ నిర్వహించింది ఎన్నికల సంఘం. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై భిన్న వాదనలు వినిపించాయి పార్టీలు. మిగతా మూడు దశల పోలింగ్లను కలిపి ఒకే రోజు నిర్వహించాలని కోరింది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేది లేదని ఈసీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆరిజ్ అఫ్తాబ్.. రాజకీయ పార్టీలకు సూచించారు.
శనివారం జరిగే 5వ దశ పోలింగ్ మినాహా..మిగిలిన మూడు విడతల పోలింగ్లను కలిపి ఒకే రోజు నిర్వహించాలని ఈసీని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. కాగా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలకు ఆటంకం కలిగించవద్దని.. మూడు దశల పోలింగ్లను ఒకే రోజు నిర్వహించవద్దని ఈసీని భాజపా కోరింది.
అయితే.. ఒకేరోజు పోలింగ్ నిర్వహించేది లేదని ఇప్పటికే స్పష్టత నిచ్చింది ఎన్నికల సంఘం. అఖిల పక్ష భేటీలోనూ అదే విషయాన్ని రాజకీయ పార్టీలకు తెలిపింది.
శనివారం రోజు ఐదో దశ పోలింగ్ జరగనుంది. ఆరో విడత పోలింగ్ ఏప్రిల్ 22న, ఏడు, ఎనిమిది దశల పోలింగ్ వరుసగా ఏప్రిల్26, 29 తేదీలలో జరగనున్నాయి. మే2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇదీ చదవండి: 'అందుకే దీదీ వారికి పౌరసత్వం ఇవ్వడం లేదు'