wang yi india visit: భారత్‌లో పర్యటించిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ.. భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో భేటీ కానున్నారు.
ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు వాంగ్ యీ. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్‌యీ... తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఇక గల్వాన్ ఘటన (రెండేళ్ల) తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత మనదేశంలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జమ్మూ-కశ్మీర్ గురించి ప్రస్తావించారు.
"కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సులో పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయి. చైనా కూడా అదే కోరుకుంటోంది"అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్ అంశం పూర్తిగా భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసింది. చైనా సహా ఏ ఇతర దేశానికీ దాని గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. ఇది జరిగిన కొన్ని గంటలకే చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: బయటకు తీసుకెళ్లలేదని భర్త కన్ను పగులగొట్టిన భార్య.. రాడ్డుతో!