రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో అనుమానస్పదంగా జింకల కళేబరాలు కనిపించాయి. ఈడెన్ సోలార్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కేవలం రెండు రోజుల్లోనే 13 జింకల మృతదేహాలు బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. సోలార్ కంపెనీ ఉద్యోగులే వాటిని చంపేస్తున్నారని ఆరోపించారు. తనిఖీకి వచ్చిన ఎన్జీఓ అధికారుల బృందం.. కంపెనీపై కేసు నమోదు చేసింది.
అసలేం జరిగిందంటే?.. జైసల్మేర్‌లోని ఈడెన్ సోలార్ కంపెనీ ఆవరణలో గత కొద్దిరోజులుగా జింకల కళేబరాలు కనిపిస్తున్నాయి. కేవలం రెండురోజుల్లో సుమారు 13 జింకల కళేబరాలు కనిపించాయి. వెంటనే స్పందించిన గ్రామస్థులు జంతు సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎన్జీఓ జంతు సంరక్షణ కమిటీ వరుసగా రెండు రోజులు తనిఖీలు నిర్వహించింది. గురువారం జరిపిన తనిఖీల్లో చనిపోయిన ఐదు జింకలను గుర్తించింది. అయితే ఎన్జీవోల బృందాన్ని సోలార్ కంపెనీ ఉద్యోగులు.. కంపెనీ లోపలకి వెళ్లేందుకు నిరాకరించారు. ఫొటోలు తీస్తున్నా కంపెనీ ఉద్యోగులు అడ్డుపడ్డారు. దీంతో సోలార్ కంపెనీపై కేసు నమోదు చేశారు ఎన్జీవోలు. చేసేదేమీ లేక కంపెనీ వెలుపల మాత్రమే తనిఖీలు నిర్వహించారు. అయితే స్థానికులు మాత్రం సోలార్ కంపెనీ వాళ్లే జింకలు చంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: విషం తాగి అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నం.. పోలీసుల తీరే కారణమా?