తమిళనాడు తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. రోజుకు రెండు ఆక్సిజన్ ట్యాంకులను ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. తొలి ట్యాంకులో 4.8 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలకు పంపించినట్లు సంస్థ తెలిపింది. మే 12 నుంచి ఇక్కడ ప్రాణావాయువు ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది.
![Vedanta Sterlite: First batch of medical oxygen dispatched](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-tut-01a-sterlite-oxygen-tanker-vis-7204870_13052021080832_1305f_1620873512_606_1305newsroom_1620882718_614.jpg)
2018లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం ఈ ప్లాంట్‌ను మూసేసింది తమిళనాడు సర్కార్. పర్యావరణ సమస్యలపై కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన నిరసనకారుల్లో 13 మంది పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అప్పటి నుంచి ఈ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది.
![Vedanta Sterlite: First batch of medical oxygen dispatched](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-tut-01a-sterlite-oxygen-tanker-vis-7204870_13052021080832_1305f_1620873512_926_1305newsroom_1620882718_383.jpg)
అయితే, గత అన్నాడీఎంకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. ఈ ప్లాంట్‌ను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇతర కార్యకలాపాలేవీ చేపట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీతో ఏర్పాటు చేసిన కమిటీ ఆక్సిజన్ ఉత్పత్తిని పర్యవేక్షిస్తోంది.
ప్లాంట్‌లో 98.6 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తయారు చేస్తున్నామని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ సీఈఓ పంకజ్ కుమార్ చెప్పారు. మెడికల్ గ్రేడ్ అనుమతులన్నీ తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వేడి నీళ్ల స్నానంతో.. కరోనా రాదా?