కర్ణాటకలో జరుగుతున్న కంబళ పోటీల్లో మరో సంచలనం సృష్టించాడు శ్రీనివాస గౌడ. దక్షిణ కన్నడ జిల్లాలోని పెర్ముడాలో జరుగుతున్న 'సూర్య-చంద్ర జోదుకేరే కంబళ' పోటీల్లో ఈ కంబళ వీరుడు కొత్త రికార్డు సృష్టించాడు. 100 మీటర్ల పరుగును కేవలం 8.96 సెకండ్లలో పూర్తిచేసి.. గత రికార్డులను తిరగరాశాడు.
కంబళ సీనియర్ విభాగంలో బాడా పూజారికి చెందిన దున్నలను వెంబడించిన శ్రీనివాస.. 125 మీటర్ల దూరాన్ని 11.21 సెకండ్లలో ఛేదించాడు. ఈ క్రమంలో 100 మీటర్ల దూరం పరుగెత్తేందుకు కేవలం 8.96 సెకండ్లే తీసుకున్నాడు. గతేడాది ఇదే పోటీల్లో బరిలోకి దిగిన అతడు.. 9.55 సెకండ్లలో 100మీటర్ల ప్రపంచ రికార్డు పరుగుతో వెలుగులోకి వచ్చాడు.
ఆ తర్వాత.. అక్కేరి సురేశ్ శెట్టి, ఇర్వత్తూర్ ఆనందలు ఈ రికార్డులను బద్దలు కొట్టారు. నిశాంత్ శెట్టి ఇటీవల జరిగిన మంగళూరు కంబళ పోటీల్లో 9.19 సెకండ్లలో 100 మీటర్లు పరుగెత్తి దాన్ని తిరగరాశాడు. తాజాగా.. శ్రీనివాస గౌడ ఈ రికార్డులన్నింటినీ చెరిపివేశాడు.
ఏమిటీ కంబళ?
ఇది ప్రధానంగా కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయబద్ధమైన పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరుగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరుగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతూ వాటిని వెంబడిస్తుంటారు.
ఇదీ చదవండి: ఆటోను 100మీటర్లు లాగిన ఆరేళ్ల చిన్నారి