Urination on Tribal man : గిరిజన వ్యక్తి చెవిలో మూత్రవిసర్జన చేశాడు అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి. మద్యం మత్తులో ఉన్నందున ఆ యువకుడికి తనపై మూత్రవిసర్జన జరిగిందన్న విషయం కూడా తెలీదు. మర్నాడు ఉదయం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారడం వల్ల.. జరిగిన అవమానం గురించి బాధితుడికి తెలిసింది. దీంతో తనపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తిపై గిరిజనుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..
సోన్‌భద్ర జిల్లాకు చెందిన జవహీర్ పటేల్, గులాబ్కోర్లకు ఇంతకుముందే పరిచయం ఉంది. జవహీర్.. పటేల్ వర్గానికి చెందిన వ్యక్తికాగా.. గులాబ్ గిరిజనుడు. జులై 11న రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో జవహీర్.. గులాబ్కోల్ చెవిలో మూత్రవిసర్జన చేశాడు. అయితే మద్యం మత్తులో ఉండటం వల్ల తనపై మూత్రవిసర్జన జరిగిన సంగతి గులాబ్‌కు తెలియదు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో తనకు జరిగిన అవమానం గురించి తెలుసుకున్న గులాబ్.. జవహీర్‌పై ఫిర్యాదు చేశాడు. కాగా జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ సహా పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. త్వరలోనే డీఐజీ కూడా త్వరలోనే ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.
"ఈ సంఘటన ఓబరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటిహట గ్రామంలో జరిగింది. కాగా నిందితుడు, బాధితుడు ఇద్దరికీ ఇదివరకే పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి మద్యం సేవిస్తుండగా.. ఓ చిన్న విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన జవహీర్.. గులాబ్‌ను దుర్భాషలాడుతూ అతడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించి.. జవహీర్‌పై కేసు నమోదు చేశాము. ప్రస్తుతానికి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాం."
-యశ్వీర్ సింగ్, సోన్‌భద్ర ఎస్పీ.
కాగా ఇదే జిల్లాలో కొన్ని రోజుల కిందట ఓ దళిత వ్యక్తిని కొట్టి, అతడిపై ఉమ్మివేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కూడా గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఇవి మరువక ముందే వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.