UP assembly election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ఏడో విడత పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. గడిచిన నెలన్నరగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచార కార్యక్రమాలకు తెరపడింది. బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు సాయంత్రం 6 తర్వాత అనుమతులు లేవని అధికారులు తెలిపారు. స్థానిక ఓటర్లు కానివారంతా నియోజకవర్గంలో ఉండకూడదని స్పష్టం చేశారు.
UP poll campaign ends
మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్ ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 54 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ సమరం ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Modi public rally in Varanasi
చివరి రోజు ప్రచారంలో భాజపా వారణాసిపై దృష్టిపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. పలువురు ప్రముఖులు, మేధావులతో భేటీ అయ్యారు. యూపీలో భాజపా అధికారంలోకి వస్తే.. రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. వారణాసిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని మోదీ అన్నారు. ప్రబుద్ధ్ వర్గ్ సమ్మేళన్ పేరుతో నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 200 మంది హాజరయ్యారు.
అంతకుముందు వారణాసిలోని ఖజూరీ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. యూపీ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలని ప్రజలే పోరాడుతున్నారని చెప్పారు.
విపక్షాలను రాజవంశాలుగా అభివర్ణించిన ఆయన.. తనపై ఉన్న కోపంతో వోకల్ ఫర్ లోకల్, స్వచ్ఛభారత్ అభియాన్ వంటి కార్యక్రమాలను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్ సమస్యపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల కష్టాలను పెంచాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. భాజపా బహిష్కృత నేత ఇంటి వద్ద పేలుడు