కొవిడ్ టీకా అందుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏడు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి చూపాలని షరతు విధించిన వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఆ నిబంధనను సడలించింది. ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ స్మార్ట్‌కార్డు, పెన్షన్ డాక్యుమెంటు లాంటి గుర్తింపు కార్డుల్లేనివారు ఎంతోమంది ఉన్నారని, అలాంటివారికి వ్యాక్సిన్ నిరాకరించవద్దంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.
సంచార జాతులు (సాధువులు, సంత్ లాంటివారు), ఖైదీలు, మానసిక ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు, వృద్ధాశ్రమాల్లో తల దాచుకొనే ముసలివారు, రోడ్ల పక్కన ఉండే యాచకులు, పునరావాస కేంద్రాల్లోని అనాథలతోపాటు ఈ కోవలోకి వచ్చే ఇంకెవరికైనా 18 ఏళ్లు నిండి ఉంటే ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా వ్యాక్సిన్ అందించాలని పేర్కొంది. ఈ వర్గాలు వైరస్ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలు ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
- జిల్లాస్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌లు ఇలాంటి దుర్బల వర్గాలను గుర్తించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.
- రాష్ట్రస్థాయిలో ఈ వివరాలన్నీ క్రోడీకరించి అలాంటివారందరికీ వ్యాక్సిన్ అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. జిల్లాలవారీగా గరిష్ఠంగా ఎంతమంది ఉంటారో అంచనా వేసి ప్రత్యేకంగా అవసరమైన డోసులు అందించాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని బహిర్గతం చేసి, ఆ ప్రతి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.
- ఇలాంటివారిని అనుసంధానపరిచే ఓ సంధానకర్తను గుర్తించాలి. వారికి మొబైల్ ఫోనుతోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏడు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి ఉండేలా చూడాలి. వీరు పైన పేర్కొన్న వర్గాలకు సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అధికారులైనా కావచ్చు.
- సంధానకర్తను గుర్తించడం, వ్యాక్సినేషన్ ప్రణాళికను రూపొందించడం కోసం జిల్లా టాస్క్‌ఫోర్స్ ఒక జిల్లాస్థాయి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. వారే ఇలాంటివారికి వ్యాక్సిన్ అందించే కేంద్రాలను గుర్తించడంతోపాటు అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించాలి.
- ఈ విషయాన్ని లబ్ధిదారులకు చేరవేసి సకాలంలో టీకా కేంద్రానికి వచ్చేలా చూడాలి. వీరి కోసం గుర్తించిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా అందించే బాధ్యతలను జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ చూడాలి.ఇలాంటివారికి వ్యాక్సిన్ అందించడానికి కొవిన్ పోర్టల్‌లో ప్రత్యేక సెషన్ అందుబాటులోకి తెస్తారు.
- ఈ ఉత్తర్వుల కింద ఇచ్చిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కేవలం గుర్తింపు కార్డులు లేని దుర్బలవర్గాలకు మాత్రమే వ్యాక్సిన్ అందించే వ్యక్తిగత బాధ్యతను జిల్లా నోడల్ అధికారి వహించాలి.
- కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే వ్యాక్సిన్లను 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉపయోగించాలి. 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి రాష్ట్ర ప్రభుత్వాల కోటాను ఉపయోగించాలి.
ఇదీ చూడండి: 'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'