దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ జాబితాలో చేరిన ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్ట్‌లు చేయించుకోవాలని కోరారు మంత్రి.
"నాకు కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు నేను చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నాకు సన్నిహితంగా మెలిగిన వారంతా.. దయచేసి పరీక్షలు చేయించుకోండి."
- రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర మంత్రి
ఆస్పత్రిలో చేరిన లోక్‌సభ మాజీ స్పీకర్
లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ అనారోగ్యం కారణంగా.. మహారాష్ట్రలోని ఇందోర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలినా.. జ్వరంతో బాధపడుతున్న ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ తీసుకున్న 26వేల మందికి కరోనా'
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు పాజిటివ్..
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కూ వైరస్ పాజిటివ్ తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇంట్లోనే ఉండి వైరస్‌కు తగిన చికిత్స తీసుకుంటానని ట్విట్టర్లో పేర్కొన్నారు థరూర్.
అధిర్ రంజన్ చౌదరికీ..
బంగాల్ కాంగ్రెస్ చీఫ్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో.. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా సరైన భద్రతా చర్యలను పాటించాలని కోరారాయన. అయితే.. బంగాల్ ఎన్నికల్లో వర్చువల్‌గా తన ప్రచారాన్ని కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
మరోవైపు.. అధిర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. "అధిర్ వేగంగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు మోదీ.
హిమాచల్ మంత్రికీ కరోనా..
హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమ్ సింగ్ ఠాకూర్ కొవిడ్ బారినపడ్డారు. తనకు వైరస్ సోకిందని స్వయంగా వెల్లడించిన ఆయన.. ఇటీవల తనకు సన్నిహితంగా ఉన్న వారంతా తగు జాగ్రత్తలు పాటించాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండి: 'కరోనా ఉద్ధృతి.. మోదీ సృష్టించిన విపత్తు'