Uniform Civil Code in Uttarakhand: తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. పదవి చేపట్టగానే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను తయారు చేయడానికి తగిన కమిటీని నియమిస్తామని చెప్పారు. కమిటీలో న్యాయ కోవిదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, మేధావులతో సహా ఇతర ప్రముఖులు ఉండేట్లు చూస్తామని పేర్కొన్నారు. విడాకులు, వివాహాలు, భూ యాజమాన్య హక్కులతో సహా పలు అంశాలపై ఈ కమిటీ తగు సూచనలిస్తుందని తెలిపారు.
"ఉమ్మడి పౌర స్మృతితో భారత రాజ్యాంగ నిర్మాతల కల నేరవేర్చే దిశగా అడుగులు వేయబోతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడదాం. మతంతో సంబంధం లేకుండా సమాజంలోని పౌరులందరికీ సమానమైన చట్టం అనే భావనను అందించే ఆర్టికల్ 44 వైపు ఇది ప్రభావవంతమైన ముందడుగు అవుతుంది."
-పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ సీఎం
ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు మాట్లాడిందని ధామీ అన్నారు. ప్రస్తుతం గోవాలో మాత్రమే ఈ చట్టం అమలులో ఉందని చెప్పారు. సామాజిక న్యాయం, లింగ సమానత్వం, మహిళా సాధికారత దీనితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న 70 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: 'దేశంలోని విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్‌కోడ్ నిబంధన!'