వర్షాకాలంలో చినుకు పడిందంటే చాలు.. హమ్మయ్యా! ఇవాళ స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే గడిపేయొచ్చు అనుకుంటారు పిల్లలు. ఏదో ఒక సాకు చెప్పి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 15ఏళ్ల సంధ్య సహాని మాత్రం ఇందుకు భిన్నం. వరదల్లో కాలు తీసి బయటపెట్టలేని పరిస్థితుల్లోనూ.. స్వయంగా తానే పడవను నడుపుకుంటూ పాఠశాలకు వెళ్లింది. ఆ బాలిక చూపించిన ధైర్యసాహసాలకు, చదువుపై ఆమెకున్న అంకిత భావానికి ప్రస్తుతం ప్రసంశలు దక్కుతున్నాయి.
![schoolgirl rows to school in boat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12981095_51_12981095_1630897988156.png)
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సంధ్య నివాసముంటున్న బహరంపుర్ గ్రామంలోనూ ఇదే పరిస్థితి. అయితే లాక్డౌన్ కారణంగా చాలా రోజులు చదువుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఇక స్కూలు తెరిచిన వెంటనే వరదలను సైతం లెక్క చేయకుండా వెళ్లానని అంటోంది సంధ్య.
"లాక్డౌన్ సమయంలో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. మంచి ఫోన్ లేకపోవడం వల్ల నేను ఆన్‌లైన్‌లోనూ చదువుకోలేకపోయాను. స్కూళ్లు తెరిచిన వెంటనే వరదలొచ్చాయి. ఎన్ని రోజులు ఇలా చూస్తూ ఉండాలి? అనిపించింది. అందుకే నా అంతట నేనే పడవ నడుపుకుంటూ పాఠశాలకు వెళ్లాను. ఎలా వచ్చావు అని నా స్నేహితులు అడిగారు. పడవలో వచ్చేశాను అని చెప్పాను. భయపడలేదా? అని అడిగారు. చిన్నప్పటి నుంచి వరదలను చూస్తూనే ఉన్నాను.. నాకెందుకు భయం అని చెప్పాను. ప్రతి సంవత్సరం వరదలొస్తాయి. ప్రతిసారీ ఇదే పరిస్థితి. అందుకే భయపడలేదు."
-- సంధ్య సహాని, యూపీ.
సంధ్య తండ్రి ఓ సాధారణ కార్పెంటర్. సంధ్యకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. పేదరికంలో అలమటించే వారు, తమ పిల్లలను చదువుకోనివ్వకుండా పనికి పంపుతూ ఉంటారు. కానీ సంధ్య తల్లిదండ్రులు మాత్రం అందుకు భిన్నం. సంధ్య చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని వారు ఆశిస్తున్నారు. అందుకు తమవంతు కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగిన సంధ్య.. బాగా చదివి రైల్వేలో మంచి ఉద్యోగం సంపాదించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.
సంధ్య 'పడవ ప్రయాణం' జాతీయ స్థాయి నేతలను ఆకర్షించింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంధ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ధైర్యాన్ని వీడకుండా పట్టుదలతో ముందుకు సాగుతున్న సంధ్య జీవితం.. ఎందరికో ఆదర్శం అని ట్వీట్ చేశారు.
నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ నిషాద్.. సంధ్య ఇంటికి వెళ్లి ఆమెను ప్రశంసించారు. సంధ్య కుటుంబానికి అండగా ఉంటామని, ఆమె చదువుకు సహాయం చేస్తామని హామీనిచ్చారు.
![schoolgirl rows to school in boat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-gkp-03-a-barve-girl-self-drive-boat-in-flood-for-going-to-school-daly-pic-7201177_06092021072140_0609f_1630893100_1028.jpg)
ఇదీ చూడండి:- ముంచెత్తిన వరద.. పడవలో వచ్చిన వధూవరులు