India China Military Talks : వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇరుదేశాల సైన్యాలు ఈ సాయంత్రం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సమన్వయం, ప్రణాళికబద్ధంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి.
2020 జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటన అనంతరం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో అక్కడ శాంతియుత వాతావరణాన్ని తెచ్చేందుకు భారత్-చైనా సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల 16వ విడతలో భాగంగా మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరిపారు. ఇలా ఇప్పటివరకు జరిపిన సంప్రదింపుల ఫలితంగా పాంగాంగ్ సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17న జరిగిన చర్చల అనంతరం గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ నుంచి ఇరుదేశాల బలగాలు, సైనిక సంపత్తిని వెనక్కి తీసుకోవాలని తాజాగా నిర్ణయించాయి. దీంతో సరిహద్దులో శాంతి నెలకొంటుందని ఇరుదేశాల సైనికాధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ కాల్పులు.. కారులో ఊరంతా తిరుగుతూ దాడులు.. నలుగురు మృతి
అమెరికాలో భారతి సంతతి వ్యక్తుల హవా.. విదేశాంగ శాఖలో ఒకరు.. జిల్లా కోర్టు జడ్జిగా మరొకరు