చీఫ్ కంప్లయన్స్ అధికారి నియామకంపై దిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖల చేసింది ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్. మరో 8 వారాలలోగా అధికారిని నియమిస్తామని వివరించింది. ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌గా స్థానికుడిని ఇప్పటికే నియమించినట్లు పేర్కొంది. ఈనెల 6 నుంచే ఆ అధికారి బాధ్యతలు చేపట్టినట్టు వెల్లడించింది.
థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా తాత్కాలిక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ నియామకం జరిపినట్లు హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఐటీ శాఖకు సమాచారం అందించామని పేర్కొంది.
హైకోర్టు ఆగ్రహం..
ట్విట్టర్ తీరుపై దిల్లీ హైకోర్టు ఈనెల 6న ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని,అధికారిని నియమించకపోవడం కచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : ఇండియా మ్యాప్‌తో మరోసారి ట్విట్టర్ ఆటలు!