Telangana Formation Day CM KCR Speech 2023 : రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమైందని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి.. రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయని వివరించారు. కొత్త చట్టంతో స్థానిక సంస్థల్లో అద్భుత మార్పు వచ్చిందన్న కేసీఆర్.. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో మనది దేశంలోనే టాప్ ర్యాంక్ అని గుర్తు చేశారు. ఇటీవల మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రానికి 23 అవార్డులు వచ్చినట్లు గుర్తు చేశారు. సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన కేసీఆర్.. అనంతరం బీఆర్‌ఎస్ సర్కార్ ప్రగతి ప్రస్థానాన్ని సవివరంగా వివరించారు.
CM KCR on Telangana Formation Day : ఈ క్రమంలోనే హరితహారంలో భాగంగా ఈ 9 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 273 కోట్ల మొక్కలు నాటామని కేసీఆర్ పేర్కొన్నారు. హరితహారంతో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌కు రెండుసార్లు గుర్తింపు దక్కిందని గుర్తు చేశారు. అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందన్న కేసీఆర్.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న హరితోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
- ఇదీ చూడండి..: CM KCR Speech at TS Formation Day 2023 : 'నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ'
CM KCR Latest Speech in Telugu : 9 ఏళ్లలో విద్యారంగంలో అద్భుత ఫలితాలు సాధించామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంఎన్‌సీ ఉద్యోగాలు సాధించే స్థాయికి గురుకులాలు ఎదిగాయన్నారు. స్వల్ప వ్యవధిలోనే వైద్య, ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచామన్న కేసీఆర్.. ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం అద్భుత పురోగతి సాధించిందని వివరించారు. పాలనా సంస్కరణలు సత్వర అభివృద్ధికి చోదక శక్తిగా మారాయన్న ఆయన.. దేశంలో అధిక వేతనం పొందుతున్నది మన ఉద్యోగులేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 20 వేల మంది వీఆర్ఏల క్రమబద్ధీకరణ, 9,355 మంది జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ ప్రక్రియలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఐటీ రంగంలో తెలంగాణ మేటిగా నిలిచిందని కేసీఆర్ వివరించారు. ఇప్పటి వరకు రూ.2.64 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. స్వరాష్ట్రంలో ఐటీ రంగంలో 220 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. ఈ క్రమంలోనే ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరింపజేశామని వివరించారు. ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చామన్న కేసీఆర్.. స్టార్టప్‌లలో టీ-హబ్ దేశంలోనే రికార్డు సృష్టించిందన్నారు.
ఇదీ చూడండి..: Governor on TS Formation Day : 'తెలంగాణను దేశంలో నెం.1గా తీర్చిదిద్దుకుందాం'
సత్తువ ఉన్నంత వరకు రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తూనే ఉంటా..: స్వరాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమని కొనియాడుతున్నారని.. అదే మాదిరిగా కొండగట్టు, వేములవాడ, ధర్మపురిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రిని వైభవంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్న కేసీఆర్.. కాశీ, శబరిమలలో రాష్ట్ర భక్తుల కోసం వసతి గృహం నిర్మిస్తామన్నారు. దశాబ్ది ముంగిట నిలిచిన రాష్ట్రానిది విప్లవాత్మక విజయ యాత్ర అన్న కేసీఆర్.. రాష్ట్రాన్ని జనం గర్వించే స్థాయికి తెచ్చిన తన జీవితం ధన్యమైందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం అందుకోవాల్సిన శిఖరాలు మరెన్నో ఉన్నాయని.. సత్తువ ఉన్నంత వరకు రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..