త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌పై సోమవారం పలువురు దాడికి పాల్పడ్డారు. ఇటీవల దాడికి గురైన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి సంతిర్బజార్కు వెళ్లిన మాణిక్ సర్కార్‌ను పలువురు అడ్డగించారు. గో బ్యాక్ సర్కార్ అని నినాదాలతో, నల్ల జెండాలు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో దుండగులు మాణిక్ సర్కార్ సహా పరామర్శించేందుకు వచ్చిన సీపీఎం సీనియర్ నేతలపై రాళ్ల దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
ఇది వారి పనే..
ఘటనపై స్పందించిన మాణిక్ సర్కార్.. ఈ దాడి భాజపా మద్దతుదార్లు చేసినదని ఆరోపించారు.
"ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి. అధికార పార్టీ హస్తం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయి. సీపీఎం పార్టీ కార్యకర్తలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి."
-మాణిక్ సర్కార్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి
మాణిక్ సర్కార్ ఆరోపణలపై త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారు భాజపా కార్యకర్తలు కారని.. వారు సీపీఎం మాజీ కార్యకర్తలని పేర్కొన్నారు. 25 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని తప్పుపట్టించిన నేతలపై వారు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం భయాందోళనలు నెలకొల్పేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి : కరోనా టెస్టుకు వెళ్లి.. క్యూలో ఉండగానే ప్రసవం!