Bengal Panchayat Election Results 2023 : బంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 30,391 సీట్లు గెలుపొందిన టీఎంసీ.. మరో 1,767 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 8,239 స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.. మరో 447 స్థానాల్లో ముందంజలో ఉంది. 2,158 పంచాయతీ స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. మరో 151 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక సీపీఐ(ఎం) పార్టీ 2,534 స్థానాల్లో విజయం సాధించింది. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఎంసీ దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయానికి లెక్కించిన ఓట్ల ఆధారంగా ఈ ఫలితాలు ప్రకటించారు అధికారులు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మరో రెండు రోజులు పట్టే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.
- పంచాయతీ సమితి ఎన్నికల ఫలితాలు ఇలా..
- టీఎంసీ-- 2,612 సీట్లలో విజయం (627 సీట్లలో ఆధిక్యం)
- బీజేపీ- 275 (149)
- సీపీఎం- 63 (53)
- కాంగ్రెస్- 50 (26)
- జిల్లా పరిషత్ ఫలితాలు ఇలా..
- టీఎంసీ- 88 (163)
- బీజేపీ- 13
- సీపీఎం- (4)
- కాంగ్రెస్- (2)
మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్లలెక్కింపు ప్రారంభం కాగా.. పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. డైమండ్ హార్బర్‌లోని ఓ కౌంటింగ్ కేంద్రంపై దుండగులు బాంబులు విసిరారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. హావ్‌డాలోని కౌంటింగ్ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74వేల పంచాయతీ స్థానాలకు గత శనివారం పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 339 కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర, కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.
West Bengal Violence 2023 : అయితే బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఘటనల్లో 15 మంది మృతిచెందారు. పోలింగ్ రోజు వివిధ పార్టీలకు చెందిన 12మంది చనిపోగా.. ఆదివారం మరో ముగ్గురు మృతిచెందారు. దక్షిణ 24పరగణాల జిల్లాలోని పశ్చిమ గబ్‌టాలా పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడిని టీఎంసీ కార్యకర్త అబు సలెంఖాన్‌గా గుర్తించారు. ఘర్షణల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్‌ను నిలిపివేశారు. అలా 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది.