Teacher turns village into school: కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో స్కూళ్లు మూతపడటం వల్ల చాలా మంది విద్యార్థులకు చదువు దూరమైంది. ఆన్లైన్, మొహల్లా క్లాసులు అని వివిధ రకాలుగా తరగతులను నిర్వహిస్తున్నా అవి విద్యార్థుల్లో అంత ప్రభావం చూపించలేదు. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో తమకు పనుల్లో సాయం ఉంటారని భావించి తల్లిదండ్రులు.. పిల్లలను వెంటతీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలోని ధర్మపుర గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. అందుకే అక్కడి టీచర్ వినూత్న పరిష్కారాన్ని కనిపెట్టారు.
ధర్మపుర ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు దినేశ్ మిశ్రా. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడిన సమయంలో విద్యార్థులకు చదువు దూరం కాకుండా ఉండేందుకు కృషి చేశారు. వారికి ఏ విధంగా చెప్తే పాఠాలపై ఆసక్తి కలిగి సులువుగా అర్థం చేసుకుంటారో అందుకు తగ్గట్టుగా ఓ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో గ్రామంలోని గోడలపై రంగురంగుల బొమ్మలు జోడించి పాఠాలు గీయించారు. గ్రామంలో ఏ వీధికెళ్లినా గోడమీద పాఠాలే దర్శనమిస్తాయి. ఊరు మొత్తాన్ని పాఠశాలగా మార్చేశారు.
'కరోనా సమయంలో గ్రామంలోకి వచ్చి పాఠాలను బోధించేవాడిని. గ్రామంలోని ఎక్కువ మంది ప్రజలు ఉదయాన్నే పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయేవారు. పేదరికం వల్ల తమ పిల్లలను కూడా పనికి తీసుకువెళ్లిపోయేవారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని భావించాను. ఇందుకోసం గోడలపై పాఠాలు చిత్రించడం ప్రారంభించాను. దీని ద్వారా గ్రామంలోని ప్రతి గోడను బ్లాక్ బోర్డుగా మార్చా.'
-దినేశ్ కుమార్ మిశ్రా, ఉపాధ్యాయుడు
తన వినూత్న ప్రయత్నంతో ఆ గ్రామం ముఖచిత్రాన్నే మార్చేశారు ఉపాధ్యాయుడు మిశ్రా. సాధారణంగా ప్రభుత్వ పాఠశాల పేరు వినగానే అక్కడి విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడుతుందని.. ఉపాధ్యాయులు పిల్లలపై పూర్తి శ్రద్ధ పెట్టరు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. మరోవైపు దినేశ్ కృషికి మంచి ఫలితాలు వస్తున్నాయి. తమ టీచర్ ఏర్పాటు చూసి పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"మాకు చాలా సంతోషంగా ఉంది. మా కోసం సార్ చాలా మంచి పని చేశారు. దీని వల్ల మేము ఆడుతూ పాడుతూ చదువుకోగలుగుతున్నాము. మా పాఠశాలను ప్రైవేటు స్కూల్‌కు దీటుగా తీర్చిదిద్దారు. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కేవలం స్కూల్లోనే కాకుండా గ్రామంలో ఎక్కడున్నా చదువుకోవడానికి వీలుగా ఉంది."
-అయూషీ రాయ్, విద్యార్థిని
దినేష్ కుమార్ కృషికి జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి టీచర్ ప్రతి పాఠశాలకు అవసరమని అంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా దినేష్ కుమార్‌లా ఆలోచిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ గోడలపై విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల ప్రతిష్ఠను పెంచిన దినేష్ కుమార్‌ను అధికారులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇదీ చదవండి: యూపీలో యోగికి షాక్.. మోదీ ఇలాకాలో భాజపా ఓటమి