ఓట్ల కోసం అక్రమ వలసదారులను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నారని మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల నేపథ్యంలో బంగాల్ మాల్దా జిల్లాలో ఓ ర్యాలీకి హాజరైన యూపీ సీఎం... టీఎంసీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ నిర్ణయాల వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో దుర్గా పూజ నిషేధించారని, ఈద్ సమయంలో గోవధ జరిగిందని ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్ని జరుగుతున్నా మమత సర్కారు మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం 'జై శ్రీరామ్' అనే నినాదమే లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
"ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలోని రామ భక్తులపై విద్వేషపూరితంగా ప్రవర్తించిన నాటి ప్రభుత్వానికి తలెత్తిన పరిస్థితే... బంగాల్లో దీదీ ప్రభుత్వానికి వస్తుంది" అని వ్యాఖ్యానించారు యోగి. యూపీలో అమలు చేసిన లవ్ జిహాద్ చట్టాన్ని బంగాల్లోనూ తెస్తామని పేర్కొన్నారు. లవ్ జిహాద్, గోవధను అదుపు చేయడంలో బంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఇదీ చదవండి:కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్లో పోటీ ఇస్తారా?