నాలుగు దశల ఎన్నికల తర్వాత బంగాల్లో టీఎంసీ విచ్ఛిన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసేసరికి మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పూర్తిగా ఓడిపోతారని అన్నారు.
శవ రాజకీయాలు చేసే అలవాటు దీదీకి ఉందని మండిపడ్డారు మోదీ. సీతల్కుచిలో దురదృష్టవశాత్తు ఐదుగురు మరణించిన విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు జరిగిన సమావేశాలకూ దీదీ గైర్హాజరయ్యారని దుయ్యబట్టారు.
ఆసన్సోల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బంగాల్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఇక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.
"సైకిళ్ల నుంచి రైళ్ల వరకు, పేపర్ నుంచి స్టీల్ వరకు, అల్యూమినియం నుంచి అద్దాల పరిశ్రమ వరకు.. అన్ని రంగాల్లో పనిచేసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు ఆసన్సోల్కు వచ్చేవారు. ఆసన్సోల్ అనేది మినీ భారత్ వంటిది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటారు. కానీ, బంగాల్ ప్రభుత్వాల అధికార దుర్వినియోగం ఆసన్సోల్పై ప్రభావం చూపింది. ప్రస్తుతం.. ఇక్కడి ప్రజలే వేరే చోటికి వలస వెళ్తున్నారు. మా, మాటి, మనుష్ అని చెప్పుకునే దీదీ.. ఇక్కడ మాఫియా రాజ్యాన్ని విస్తరించారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
అభివృద్ధి పేరుతో గత పదేళ్లుగా ప్రజలను దీదీ మోసం చేశారని అన్నారు మోదీ. బంగాల్ ప్రజలకు, కేంద్ర పథకాలకు మధ్య దీదీ.. ఓ గోడలా నిల్చున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పేదలకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేలా కేంద్రం పథకం రూపొందిస్తే.. దాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకున్నారని చెప్పారు. శరణార్థుల కోసం చట్టం తీసుకొస్తే.. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: 'సీడబ్ల్యూసీ' భేటీ- కరోనా పరిస్థితులపై చర్చ